Janhvi Kapoor: అప్పటి నుంచే తిరుమల వెళ్లడం ప్రారంభించా: జాన్వీ కపూర్

తరచూ తిరుమల వెళ్లడానికి గల కారణాన్ని జాన్వీ తెలిపారు. శ్రీదేవి మరణించిన తర్వాత చాలా అలవాట్లను మార్చుకున్నట్లు చెప్పారు.

Updated : 27 May 2024 12:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) తరచు తిరుమల వెళ్తుంటారు. తన సినిమా విడుదలకు ముందు, పుట్టినరోజునాడు, ప్రత్యేక తేదీల్లోనూ ఆమె తిరుమల స్వామి వారిని దర్శించుకుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తరచూ అక్కడకు వెళ్లడానికి గల కారణాన్ని తెలిపారు. తన తల్లి మరణించిన తర్వాత చాలా అలవాట్లను మార్చుకున్నట్లు చెప్పారు.

‘అమ్మ కొన్ని విషయాలను బాగా విశ్వసించేది. ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని పనులు చేయడానికి అంగీకరించేది కాదు. శుక్రవారం జుట్టు కత్తిరించుకోకూడదని, అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని అంటుండేది. ఆరోజు నల్ల దుస్తులను కూడా వేసుకోనిచ్చేది కాదు. ఆమె బతికి ఉన్నప్పుడు ఇలాంటి వాటిని పట్టించుకోలేదు. మూఢనమ్మకాలు అని కొట్టిపడేసేదాన్ని. కానీ, ఆమె మా నుంచి దూరమయ్యాక వీటిని నమ్మడం మొదలుపెట్టాను. ఆమె కంటే నేనే ఎక్కువగా విశ్వసిస్తున్నా. అమ్మ ఎప్పుడూ తిరుమల దేవుడి పేరును తలచుకుంటూ ఉండేది. షూటింగ్‌ గ్యాప్‌లో కూడా నారాయణ, నారాయణ అనుకుంటుండేది. ప్రతి ఏడాది పుట్టినరోజు స్వామి వారిని దర్శించుకునేది. ఆమె చనిపోయిన తర్వాత తన పుట్టినరోజుకి నేను ఆ గుడికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. అమ్మ లేకుండా మొదటిసారి తిరుమల వెళ్లినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. అక్కడికి వెళ్లిన ప్రతిసారి ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే తరచు వెళ్తుంటాను’ అని చెప్పారు. శ్రీదేవి తల్లి స్వస్థలం తిరుపతి కావడం గమనార్హం.

150 రోజుల ట్రైనింగ్‌.. 30 రోజుల షూటింగ్‌.. రెండుసార్లు గాయాలు

ప్రస్తుతం జాన్వీ ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రికెట్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్‌, మహిమ పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. అపూర్వ మోహతా, కరణ్‌జోహార్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని