Janhvi Kapoor: గాయాలు తట్టుకోలేక.. తప్పుకొందామనుకున్నా!

కథల ఎంపికలో తనదైన ప్రత్యేకతను చూపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది బాలీవుడ్‌ నాయిక జాన్వీ కపూర్‌. ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న ఈ భామ..

Published : 07 Jun 2024 00:58 IST

కథల ఎంపికలో తనదైన ప్రత్యేకతను చూపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది బాలీవుడ్‌ నాయిక జాన్వీ కపూర్‌. ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న ఈ భామ.. ఇటీవలే ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. ఈ చిత్రంలోని తన అనుభవాలను ఇలా పంచుకుంది.

  •  ‘‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ మనసును ఆకట్టుకునే భావోద్వేగాలు, మంచి విలువలతో నిర్మించిన చిత్రం. కుటుంబ సమేతంగా చూడొచ్చు. యువతకు స్ఫూర్తినిచ్చే విధంగానూ ఉంటుంది. ఒక వ్యక్తి తన కలల్ని నిజం చేసుకోవడానికి కుటుంబ తోడ్పాటు ఎంత అవసరమో ఇందులో చూపించాం’’.
  • ‘‘మొదట్నుంచీ భిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూనే ముందుకు సాగుతున్నాను. కానీ.. ఇందులో మీరు మరో కొత్త జాన్వీ కపూర్‌ను చూస్తారు. 
  • ఈ పాత్ర కోసం మానసికంగా, శారీరకంగా ఎన్నో కసరత్తులు చేశాను. ఇప్పటివరకు నేను నటించిన పాత్రలన్నింటి కన్నా.. ఇందులో మహిమ పాత్రలో రెండింతల ఉత్సాహాన్ని, అనుభూతిని పొందాను. ఇంతకముందెప్పుడూ ఏ పాత్రలోనూ ఇలా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటూ నటించలేదు’’.
  •  ‘‘ఎంచుకునే ప్రతి పాత్రలోనూ కొత్తదనం ఉండేలా చూసుకుంటాను. ఇప్పటి వరకు రెండు సినిమాల్లో పెళ్లయిన అమ్మాయిగా నటించాను. ఇలాంటి పాత్రల్లో నటించడం వల్ల వివాహ పద్ధతుల గురించి సులభంగా తెలుసుకోగలుగుతున్నాను. ఈ పాత్రల నేపథ్యం ఏంటి? వైవాహిక అనుబంధాలు ఎలా ఉంటాయి? ఇలాంటివన్నీ నేను పరిగణించవలసిన ముఖ్యమైన అంశాలు’’.
  • ‘‘ఈ చిత్రం కోసం క్రికెట్‌ శిక్షణ తీసుకున్నా. నా కోచ్‌లు నన్ను క్రికెట్‌ అభిమానిగా మార్చేశారు. ఇందులో క్రికెట్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో ఎన్నోసార్లు గాయాలయ్యాయి. తట్టుకోలేక కొన్నిసార్లు ఈ సినిమా నుంచి తప్పుకోవాలనుకున్నా. కానీ తర్వాత మనసు మార్చుకొని, ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రతి సీన్‌ సహజంగా రావడానికి ఎంతో కష్టపడ్డాను’’.
  • ‘‘రాజ్‌కుమార్‌ రావ్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. సినిమా గురించి, ఆ ప్రాజెక్టులో భాగమైన నటులు, సాంకేతిక నిపుణులు, సినిమా నిర్మాణం.. ఇలా ప్రతి అంశం పట్ల చాలా మక్కువ కలిగి ఉంటారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో మానసికంగా ధైర్యాన్ని చెప్తూ సహకరించారు’’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని