Kalki: ‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్ ఇదే

ప్రభాస్‌ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. 

Published : 27 Apr 2024 17:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD). భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా గత కొన్ని రోజులుగా ట్రెండింగ్‌లో ఉంటోంది. ఇందులో అశ్వత్థామ  పాత్ర పోషిస్తోన్న అమితాబ్‌ గ్లింప్స్ విడుదల చేయడం ఒక కారణమైతే.. దీని విడుదల తేదీపై జరుగుతోన్న చర్చ మరో కారణం. రిలీజ్‌ వాయిదా పడనుందంటూ కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడీ విషయంపై మూవీ టీమ్‌ పోస్ట్‌ పెట్టింది. కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది.

ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే, అనుకోని కారణాల వల్ల దీన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా తెలిపింది. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ‘కల్కి’ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని విడుదల తేదీని మార్చినట్లు తెలుస్తోంది. సైన్స్‌ ఫిక్షన్‌ కథతో, పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్‌ ‘భైరవ’గా కనిపిస్తుండగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్ అశ్వత్థామగా నటించనున్నారు.  కమల్‌హాసన్‌ (Kamal Haasan) ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా దీపిక పదుకొణె నటిస్తుండగా పశుపతి, దిశాపటానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని