Ashwathama: ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?

ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు.

Updated : 23 Apr 2024 11:49 IST

మహాభారతంలోని ఒక పాత్ర అశ్వత్థామ. సప్త చిరంజీవుల్లో (అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు) ఒకడు. ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) అశ్వత్థామగా కనిపించనున్నట్లు తెలుపుతూ ఆయన పాత్రను పరిచయం చేసింది. శరీరంపై గాయాలతో, చిరిగిన వస్త్రాలు కట్టుకుని అమితాబ్‌ కనిపించారు. ఒక షాట్‌లో యంగ్‌ అమితాబ్‌ నుదుటిపై మణి కనిపిస్తుంది. ‘ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నా. ద్రోణాచార్య తనయుడు అశ్వత్థామని..’ అని అమితాబ్‌ చెప్పడంతో ఇంతకీ ఎవరాయన? అని నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. అసలు ఆ పాత్ర ఏంటి? అతడి శరీరంపై గాయాలు, నుదుటిపై మణి కథేంటి? శ్రీకృష్ణుడు అతనికి ఇచ్చిన శాపం ఏంటి?

ద్రోణుడి కుమారుడు..

పాండవులు, కౌరవులకు గురువైన ద్రోణుని ఏకైక కుమారుడు అశ్వత్థామ. అతడి తల్లి కృపి. ద్రోణుడి తపస్సుకు మెచ్చి, శివుని వరం వల్ల అతడు నుదుటిపై మణితో జన్మిస్తాడు. ఆ మణి ప్రభావం కారణం ఇతర మానవులతో పోలిస్తే, ఆకలి, దప్పుల నుంచి రక్షణ పొందగలడు. అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం సాధిస్తాడు. ఎదుటి వారి ముఖస్తుతికి లొంగిపోయే గుణం కలిగిన అశ్వత్థామ.. మొదటి నుంచి కౌరవుల పక్షాన నిలుస్తాడు. మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది. కదన రంగంలో ఆయనను ఓడించడం పాండవులకు అసాధ్యం. దీంతో ధర్మ పరిరక్షణ కోసం కృష్ణుడు పథకం రచిస్తాడు. జీవితంలో ఎప్పుడూ అసత్యం పలకని ధర్మరాజును పిలిచి ఆయన చనిపోయాడని చెప్పమని కోరతాడు. తొలుత ధర్మరాజు అందుకు ఒప్పుకోడు. కానీ, కృష్ణుడి సూచన మేరకు అబద్ధం ఆడేందుకు సరేనంటాడు. ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ధర్మరాజు ‘అశ్వత్థామ హతః..’ అని గట్టిగా చెప్పి.. ‘కుంజరః’ అని నెమ్మదిగా అంటాడు. తన కుమారుడే మరణించాడనుకుని ద్రోణాచార్యుడు యుద్ధంలో అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదనుగా భావించిన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని చంపేస్తాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో కర్ణ దుర్యోధనాదులు, ఇతర కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టి మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు.

ఉప పాండవులను చంపి...

తండ్రి మరణం, స్నేహితులైన కౌరవులు నశించడం సహించలేకపోయిన అశ్వత్థామ తీవ్ర కోపంతో రగిలిపోతాడు. పాండవులను ఎలాగైనా అంతం చేస్తానని దుర్యోధనుడి మరణానికి ముందు అతడికి మాట ఇస్తాడు. శివుని అనుగ్రహంతో వరం పొంది, ద్రౌపదీ పుత్రులైన ఐదుగురు ఉప పాండవులను (ప్రతివింధ్యుడు, శ్రుతసోముడు, శ్రుతకర్ముడు, శతానీకుడు, శ్రుతసేనుడు) చంపేస్తాడు. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు, పాండవులు అతడిని వెంబడిస్తారు. గురు పుత్రుడన్న కారణంగా చంపకుండా వదిలేస్తారు. అశ్వత్థామ కపటబుద్ధి తెలిసిన శ్రీకృష్ణుడు అతడిని ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా అడ్డుకునేందుకు పాండవులతో కలిసి కౌరవ శిబిరానికి చేరుకొంటాడు. అప్పటికే అతడు వ్యాసాశ్రమానికి వెళ్లడంతో కృష్ణుడు అక్కడికి వెళ్తాడు.

బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం..

కృష్ణుడితో కలిసి వ్యాసాశ్రమానికి వచ్చిన పాండవులను చూసిన అశ్వత్థామ క్రౌర్యంతో రగిలిపోతాడు. కోపంలో విచక్షణ కోల్పోయి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని  ‘అపాండవీయం అవుగాక’ అని ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర శక్తి వల్ల భూమ్మీద ఉన్న పాండవులు, వారి సంతతి మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. కానీ, దాన్ని అడ్డుకోమని అర్జునుడిని ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అడ్డుకోవాలంటే అదే అస్త్రాన్ని ప్రయోగించాలి. అర్జునుడి తపోశక్తి వల్ల అప్పటికే ఆ  అస్త్రాన్ని పొంది ఉండటంతో ‘పాండవులకు క్షేమం చేకూరుగాక’ అని మరోవైపు నుంచి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. రెండూ బ్రహ్మశిరోనామకాస్త్రాలు ఢీకొంటే ప్రళయమే. భూమండలమంతా సర్వనాశనమైపోతుంది. వెంటనే ఈ ఉపద్రవాన్ని గ్రహించిన వ్యాస మహర్షి, నారదుడు పరుగు పరుగున వచ్చి, అస్త్రాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా అర్జునుడిని కోరతారు. పెద్దల సూచన మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. ‘మరి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం మాటేమిటి గురువర్యా’ అని వ్యాసుడిని అర్జునుడు అడగ్గా.. ‘అస్త్రాన్ని ఉపసంహరించు. పాండవులు నిన్ను ఏమీ చేయరు’ అని అశ్వత్థామకు వ్యాసుడు సూచిస్తాడు.

వ్యాసుడి మాటకు గౌరవం ఇస్తున్నట్లు నటిస్తూనే ‘పాండవేయ రాగ గర్భాలు నశించుగా’ అని అతడు తన అస్త్రాన్ని దిశ మారుస్తాడు. దాని ప్రకారం.. పాండవుల భార్యలు, కోడళ్లు గర్భాలను ఆ అస్త్రం విచ్చిన్నం చేస్తుంది. అప్పుడు ఉత్తర ఒక్కతే గర్భంతో ఉండటంతో ఆమె గర్భం విచ్ఛినమవుతుంది. అశ్వత్థామ కుటిల బుద్ధికి కోపోద్రిక్తుడైన శ్రీకృష్ణుడు అతడి తలపై ఉన్న సహజ మణిని తీసి శపిస్తాడు. ‘ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో, ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమ్మీదే తిరుగు’ అని పేర్కొంటాడు. బ్రహ్మాశిరోనామకాస్త్ర ప్రయోగం వల్ల ఉత్తర గర్భంలో మరణించిన శిశువును కృష్ణుడు తన యోగమాయతో ప్రాణంపోసి బతికిస్తాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరినీ పరీక్షగా చూస్తుండటంతో అతడికి పరీక్షిత్‌ అని పేరు పెడతారు. బ్రాహ్మాణుడు, అన్ని విద్యలలో సుశిక్షితుడు అయిన అశ్వత్థామ రాగద్వేషాలు, బంధుప్రీతి కారణంగా క్రోధం, మూర్ఖత్వాలకు లోనై శాపగ్రస్తుడయ్యాడు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ గుణపాఠం.

ఇక ‘కల్కి’లో అమితాబ్‌ అశ్వత్థామగా కనిపిస్తుండటంతో ఆ పాత్రపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ద్వాపరయుగం నుంచి అశ్వత్థామ ఎందుకు శ్రీమహా విష్ణువు పదో అవతారం కోసం ఎదురు చూస్తున్నాడు? అతడికి శాప విమోచనం అవుతుందా? తిరిగి ఆ సహజమణి అతడికి చేరుతుందా? భైరవ (ప్రభాస్‌)కు అతడు సాయం చేస్తాడా? లేక పోరాడతాడా? వంటి ప్రశ్నలకు ‘కల్కి’లో సమాధానం దొరికే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో దీపికా పదుకొణె, కమల్‌హాసన్‌, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై ఈ చిత్రం రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. విడుదల తేదీ  ప్రకటించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని