Kareena Kapoor: ఆ ప్రాజెక్ట్‌ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్‌ చెప్పాలి: కరీనాకపూర్

బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ (Kareena Kapoor) తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తానొక హిట్‌ ప్రాజెక్ట్‌ వదులుకున్నానని.. దాంతో ఆ అవకాశం దీపికను వరించిందని తెలిపారు.

Updated : 20 Apr 2024 15:17 IST

ముంబయి: బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ఖాన్‌ (Kareena Kapoor) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. గతంలో ఆమె చేయలేకపోయిన పలు చిత్రాల గురించి మాట్లాడారు. తానొక  ప్రాజెక్ట్‌ వదులుకున్నానని.. దాంతో ఆ అవకాశం దీపికను వరించిందని తెలిపారు. కాబట్టి ఆమె తనకు కృతజ్ఞతలు చెప్పాలని సరదాగా అన్నారు. ఇంతకీ కరీనా వదులుకున్న ఆ సినిమా ఏమిటంటే..?

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ రూపొందించిన సూపర్‌హిట్‌ మూవీ ‘రామ్‌ లీలా’. రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా షూట్‌లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉండగా, ‘రామ్‌లీలా’ హీరోయిన్‌గా మొదట అవకాశం తనకే వచ్చిందని తాజాగా కరీనా కపూర్‌ తెలిపారు. ‘‘నేను విధిరాతను నమ్ముతుంటా. మనకు ఏదైతే రాసి పెట్టి ఉంటుందో తప్పకుండా అది జరిగి తీరుతుంది. అన్నీ అందరికీ రాసి ఉండవు. ఆ సినిమా అవకాశం వచ్చినప్పుడు అనుకోని కారణాలతో దానిని అంగీకరించలేదు. దాంతో ఆ ఛాన్స్‌ దీపికను వరించింది. అలా, రణ్‌వీర్‌తో ఆమె తొలిసారి వర్క్‌ చేశారు. వాళ్లిద్దరి రిలేషన్‌కు పరోక్షంగా నేనే కారణం. కాబట్టి వాళ్లిద్దరూ నాకు కృతజ్ఞతలు చెప్పాలి’’ అని కరీనా సరదాగా అన్నారు. ‘కల్‌ హో నా హో’లో హీరోయిన్‌గా ఛాన్స్‌ వచ్చినప్పటికీ చేయలేదని తెలిపారు. ఒకవేళ ఆ ప్రాజెక్ట్‌ చేసి ఉంటే సైఫ్‌ అలీఖాన్‌తో తన బంధం ఎప్పుడో మొదలయ్యేదన్నారు.

జీవితంలో ఎప్పటికీ సంజయ్‌ లీలా భన్సాలీ మూవీలో యాక్ట్‌ చేయనని గతంలో ఓ సందర్భంలో కరీనాకపూర్‌ తెలిపారు. ‘దేవదాస్‌’ చిత్రంలో ఆఫర్‌ ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నారని చెప్పారు. అది తననెంతో బాధించిందన్నారు. ‘‘దేవదాస్‌’ (2002) హీరోయిన్‌ పాత్రకు సంజయ్‌ లీలా భన్సాలీ మొదట నన్నే ఎంచుకున్నారు. స్క్రీన్‌ టెస్ట్‌ చేసి కాస్త అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. కానీ, చివరకు నా స్థానంలో వేరే నటిని తీసుకున్నారు. కెరీర్‌ ఆరంభంలోనే ఇలా జరగడం నన్నెంతో బాధించింది. ఒకవేళ నాకు వర్క్‌ లేకపోయినా.. ఆయన సినిమాలో మాత్రం నటించను’’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో బీటౌన్‌లో చర్చకు దారి తీశాయి.

సినిమాల విషయానికి వస్తే.. ‘క్రూ’తో కరీనా కపూర్‌ ఇటీవల విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ‘సింగం అగైన్‌’ కోసం వర్క్‌ చేస్తున్నారు. రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆమె అజయ్‌ దేవ్‌గణ్‌కు జంటగా సందడి చేయనున్నారు. మరోవైపు, కరీనా త్వరలోనే దక్షిణాది చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం సాగుతోంది. యశ్‌ హీరోగా చేయనున్న ‘టాక్సిక్‌’లో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని