Dhruva Natchathiram: మళ్లీ చిక్కుల్లో విక్రమ్‌ ‘ధృవ నక్షత్రం’.. విడుదలకు హైకోర్టు నిబంధన

విక్రమ్‌ హీరోగా దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ తెరకెక్కించిన ‘ధృవ నక్షత్రం’ సినిమా మరోసారి సమస్యలో పడింది. 

Published : 24 Nov 2023 01:54 IST

ప్యారిస్‌ (చెన్నై): విక్రమ్‌ (Vikram) హీరోగా దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) తెరకెక్కించిన చిత్రం ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram). ఆరేళ్ల క్రితమే విడుదలకావాల్సిన ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 24న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. అయితే, ఇప్పుడు మరో సమస్య తలెత్తింది. ఈ సినిమా విడుదలకు మద్రాసు హైకోర్టు నిబంధన విధించింది. శింబు హీరోగా గౌతమ్‌ మేనన్‌ ‘సూపర్‌ స్టార్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఒప్పందం కుదుర్చుకుని, ఆ మేరకు రూ.2.40 కోట్లు తీసుకున్నారని, కానీ ఆయన సినిమాని పూర్తి చేయలేదని.. డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ తరఫున హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నగదు తిరిగి ఇవ్వకుండా ‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదల చేసేందుకు నిషేధం విధించాలని పిటిషన్‌లో కోరారు. గురువారం ఈ కేసు విచారణకు రాగా న్యాయస్థానం సినిమా విడుదలకు షరతు విధించింది. ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ నుంచి గౌతమ్ తీసుకున్న డబ్బును శుక్రవారం(నవంబర్‌ 24న) ఉదయం 10.30 గంటల లోపు తిరిగి ఇవ్వాలని, లేదంటే సినిమా విడుదల చేయకూడదని ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో, సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొంది.

విలన్‌ పాత్రలు చేయకూడదనుకుంటున్నా: విజయ్‌ సేతుపతి

ఈ సినిమా గురించి గౌతమ్‌ ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘‘నటనపట్ల ఆసక్తితో సినిమాల్లో నటించడం లేదు. ‘ధృవ నక్షత్రం’ కోసమే నేను నటుడిగా మారా. ఆయా చిత్రాల్లో యాక్ట్‌ చేసినందుకుగాను వచ్చిన పారితోషికాన్ని ఈ సినిమా మేకింగ్‌.. విడుదల కోసం ఉపయోగించా. అలాగే, సినిమాల్లో అవకాశం ఇవ్వమని నేను ఇప్పటివరకూ ఎవరినీ అడగలేదు. అలాగే, కొన్ని సినిమాల్లో అవకాశాలనూ వదులుకున్నా’’ అని ఆయన చెప్పారు. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కింది. 2017లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. ఈ సినిమాలో రీతూవర్మ, సిమ్రన్‌, ఐశ్వర్య రాజేశ్‌, రాధిక తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని