Vijay: చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్‌.. విజయ్‌ సినిమాలో దివంగత నటుడు!

విజయ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్‌ కనిపించనున్నారు.

Published : 17 Apr 2024 00:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం ఏఐ (కృతిమ మేధ)ను విరివిగా వినియోగిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Artificial intelligence) సాయంతో.. దివంగత గాయకుల గాత్రాన్ని వినిపించడమే కాకుండా దివంగత నటులను మరోసారి తెరపైకి తీసుకొస్తోంది. తాజాగా ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ (The Greatest of All Time) టీమ్‌ ఈ జాబితాలో చేరింది. కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌ (Vijay) హీరోగా దర్శకుడు వెంకట్‌ ప్రభు తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఏఐ ద్వారా దివంగత నటుడు కెప్టెన్‌ విజయకాంత్‌ (Vijayakanth)ను ఈ సినిమాలో చూపించినున్నట్లు ఇటీవల ప్రచారం జరిగ్గా దానిపై ఆయన సతీమణి ప్రేమలత స్పందించారు.

ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ది గోట్‌’లో ఓ సన్నివేశంలో విజయకాంత్‌ రూపం తెరపై కనిపించనుందని చెప్పారు. ఈ మేరకు అనుమతి కోసం వెంకట్‌ ప్రభు తనని పలుమార్లు విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. విజయ్‌, అతడి తండ్రి ఎస్‌.ఎ. చంద్రశేఖర్‌ అంటే విజయకాంత్‌కు అభిమానమని గుర్తు చేశారు. గతంలో ‘వెట్రి’, ‘సెంతూరపండి’ తదితర చిత్రాల్లో విజయకాంత్‌, విజయ్‌ కలిసి నటించారు. విజయకాంత్‌ గతేడాది డిసెంబరులో అనారోగ్యంతో మరణించారు.

రజనీకాంత్‌ కీలక పాత్ర పోషించిన ‘లాల్‌ సలాం’ సినిమాలో దివంగత గాయకులు బాంబా బక్యా, షాహుల్‌ హమీద్‌ల వాయిస్‌ను సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఏఐ సాయంతో వినిపించిన సంగతి తెలిసిందే. ‘కీడా కోలా’ సినిమా కోసం టాలీవుడ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటను రీక్రియేట్‌ చేశారు. ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ విషయానికొస్తే.. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. విజయ్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 5న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని