Manchu Manoj: అందుకు నన్ను క్షమించాలి: మంచు మనోజ్‌

మంచు మనోజ్‌ (Manchu Manoj) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ గేమ్‌ షో ‘ఉస్తాద్‌’ (USTAAD RAMP ADIDHAM). ఈ ప్రోమో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

Updated : 06 Dec 2023 19:16 IST

హైదరాబాద్‌: మంచు మనోజ్‌ (Manchu Manoj) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ గేమ్‌ షో ‘ఉస్తాద్‌ ర్యాంప్‌ ఆడిద్దాం’ (USTAAD RAMP ADIDHAM). డిసెంబర్‌ 15 నుంచి ఈటీవీ విన్‌ వేదికగా ఇది ప్రసారం కానుంది. తాజాగా ఈ షో ప్రోమో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఇందులో పాల్గొన్న మంచు మనోజ్‌ తన కెరీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులు తనకు ఎప్పుడూ అండగా నిలిచారని.. ఏడేళ్లు విరామం తీసుకున్నందుకు క్షమించాలని కోరారు.

‘‘ఏడేళ్ల గ్యాప్‌ తర్వాత ఏడడుగులు వేసి మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నా. ఈ విరామంలో నేను మరో జీవితాన్ని చూశా. గతంలో సినిమాలు చేసేటప్పుడు ఒక అభిరుచి, లక్ష్యంతో చేసేవాడిని. గ్యాప్‌ తీసుకున్నప్పటికీ అభిమానులు నాపై చూపించిన ప్రేమాభిమానాలను బాధ్యతగా తీసుకుని రీఎంట్రీ ఇస్తున్నా. ఇన్నేళ్లలో నాకు ధైర్యంగా నిలిచింది వాళ్లే. మౌనికతో ప్రేమలో పడిన తర్వాతే.. అభిమానులు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో అర్థమైంది. సినిమాల నుంచి గ్యాప్‌ తీసుకున్నందుకు నన్ను క్షమించాలి. ఇకపై వినోదం మరోస్థాయిలో ఉండనుంది. ఈ గేమ్‌ షోతో నాకు మంచి టీమ్‌ దొరికింది. అందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నా. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు గారు, ఈటీవీ సీఈవో బాపినీడు గారు, నితిన్‌, సాయి కృష్ణ, సాయికిరణ్‌.. ఇలా ప్రతి ఒక్కరూ ఈషోను అద్భుతంగా తీర్చిదిద్దడంలో మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు’’

Renu Desai: ‘యానిమల్‌’ని ప్రశంసించి.. కామెంట్‌ సెక్షన్‌ క్లోజ్‌ చేసిన రేణూ దేశాయ్‌

‘‘ఈ షో కోసం నన్ను సంప్రదించినప్పుడు.. కాన్సెప్ట్‌ ఏమిటని అడిగాను. వాళ్లు చెప్పిన కాన్సెప్ట్‌ విని నాకు సంతోషంగా అనిపించింది. ఇదొక సెలబ్రిటీ గేమ్‌ షో. తమని ఎంతగానో అభిమానించే ఫ్యాన్‌ కోసం ఒక సెలబ్రిటీ ఆడే ఆట ఇది. ఈ ఆటలో సెలబ్రిటీ గెలుచుకున్న మొత్తాన్ని ఆ అభిమానికి ఇచ్చేస్తాం. అదే ఈ షో స్పెషాలిటీ. ప్రైజ్‌ మనీ వచ్చేసి.. రూ.50 లక్షలు, స్పెషల్‌ గిఫ్ట్‌లు కూడా ఉంటాయి’’ అని ఆయన తెలిపారు. ఏడేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నా అని మంచు మనోజ్‌  చెప్పగానే సభా ప్రాంగణంలో ఉన్న ఆయన సతీమణి మౌనిక భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మాటలకు ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ షో ఫార్మాట్‌ చెప్పగలరు? సీజన్‌ 2 కూడా ఉండే అవకాశం ఉందా? 

మనోజ్‌: ఇదొక వీక్లీ షో. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్‌ చిత్రీకరణ జరిగింది. డిసెంబర్‌ 15 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి వారం ఒక ఎపిసోడ్‌ రిలీజ్‌ చేస్తాం. సీజన్‌ 2కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా?
మనోజ్‌: సమాజానికి ఏదైనా మంచి పని చేయాలనే ఆలోచన ఉంది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకుంటే తప్పకుండా ప్రకటిస్తా.

‘అన్‌స్టాపబుల్‌’తో హోస్ట్‌గా బాలకృష్ణ ఒక మార్క్‌ క్రియేట్‌ చేశారు. మరి, మీ హోస్టింగ్‌ ఎలా ఉండనుంది?
మనోజ్‌: ఒక సెలబ్రిటీ టాక్‌ షోకు బాలకృష్ణ గారు హోస్టింగ్‌ చేశారు. ఆయన హోస్టింగ్‌ చాలా బాగుంటుంది. అయితే, ఇది టాక్‌ షో కాదు. ఇదొక  గేమ్‌ షో. మాటలతోపాటు ఆటలు కూడా ఉంటాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు రానున్నాయి. మీ సపోర్ట్‌ ఎవరికి ఉండనుంది?
మనోజ్‌: ఏ రాజకీయ పార్టీకి వ్యక్తిగతంగా నేను సపోర్ట్‌ చేయలేదు. ఫలానా పార్టీకి ఓట్లు వేయమని నేను ఎప్పుడూ అడగలేదు. నాకు తెలిసిన వాళ్లు ఎవరైనా పోటీ చేస్తే వాళ్లకు మాత్రమే సపోర్ట్ చేశా. భవిష్యత్తులో నా భార్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నా. ఆమె వెన్నంటే నేను నిలబడతా. ఒక భర్తగా ఆమెకు సపోర్ట్ చేయడం నా బాధ్యత.

మీరు ఏడేళ్లు గ్యాప్‌ తీసుకోవడానికి కారణం ఏమిటి?
మనోజ్‌: 11 నెలల వయసు నుంచి నేను సినిమాల్లో ఉన్నా. నాకు సినిమా తప్ప వేరే ఏమీ తెలియదు. జీవితంలో ఒక దశలో.. ఇకపై నా సొంతంగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నా. కాకపోతే, వేర్వేరు కారణాల వల్ల అది జరగలేదు. వ్యక్తిగత కారణాల వల్ల అదే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా. కాస్త బ్రేక్ తీసుకుందామని నిర్ణయించుకున్నా. అలా, ఏడేళ్లు గడిచిపోయింది. ఈ సమయంలో ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నా. ఇకపై చేయనున్న ప్రాజెక్ట్‌ల విషయంలో సంతోషంగా ఉన్నా. జనవరిలో ఇతర ప్రాజెక్ట్‌లు అనౌన్స్‌ చేస్తా.

చిరంజీవి - రవితేజతో మీరు షో ప్లాన్‌ చేశారని విన్నాం నిజమేనా?
వివేక్‌: ఇది నిజంగానే నాకొక మంచి వార్త. అలాంటి అవకాశం వస్తే అంతకంటే అదృష్టం ఉండదు.

ఈ షోకి చిరంజీవి, మోహన్‌బాబును తీసుకువచ్చే ఛాన్స్‌ ఉందా? మీ సోదరితో ఎపిసోడ్‌ ఏమైనా ఉందా? 
మనోజ్‌: వాళ్లిద్దరూ కలిసి వస్తే చేస్తా (నవ్వులు). అక్కతో ఒక ఎపిసోడ్‌ చేయాలనే ప్లాన్‌ ఉంది. కాకపోతే ఆమె వరుస షూట్స్‌తో బిజీగా ఉన్నారు. వీలు కుదిరినప్పుడు చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని