Manchu Manoj: ఏ పార్టీనీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు: మంచు మనోజ్‌

తన తండ్రి మోహన్‌బాబు (Mohan Babu) పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఓటు వినియోగంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.

Updated : 21 Mar 2024 23:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మోహన్‌బాబు (Mohan Babu) పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మంచు మనోజ్‌ (Manchu Manoj) చేసిన వ్యాఖ్యలు అంతటా చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. పది మందితో కలిసి ముందుకుసాగే సరైన లీడర్‌ను ఎన్నుకోండంటూ యువతను ఉద్దేశించిన ఆయన అన్న మాటలను పలువురు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే తన వ్యాఖ్యలపై స్పష్టత నిచ్చారు. ఏ రాజకీయ పార్టీనీ ఉద్దేశించి తాను మాట్లాడలేదన్నారు.

‘‘మా నాన్న పుట్టినరోజు వేడుకల్లో ఏర్పడిన కొన్ని అపార్థాలు, పలు విషయాల గురించి ప్రస్తావించాలనుకుంటున్నా. ముఖ్యంగా, నా ప్రసంగం చుట్టూ నెలకొన్న గందరగోళంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. రాజకీయ హద్దులు దాటి.. ఐక్యత, గౌరవంతో ముందుకుసాగాలనేది నా మాటల్లోని ప్రధాన ఉద్దేశం. దురదృష్టవశాత్తూ లైవ్‌ స్ట్రీమింగ్‌లో సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తడంతో నేను మాట్లాడిన కొన్ని కీలక అంశాలు ప్రసారం కాలేదు. అది కాస్తా తప్పుడు అర్థాలకు దారితీసింది. ప్రసంగాన్ని ముగించే సమయంలో మాట్లాడిన కొన్ని మాటలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు.

ఏదో ఒక రాజకీయ పార్టీ లేదా నాయకుడిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఏ రాజకీయ పార్టీతోనూ నాకు సంబంధాల్లేవు. టెక్నికల్‌గా ఏర్పడిన సమస్యలను గుర్తించి క్షమాపణలు చెప్పిన ఆ టీమ్‌కు ధన్యవాదాలు. ఆ సభలో నేను మాట్లాడిన పూర్తి స్పీచ్‌ను ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తున్నా. ఒక నటుడిగా సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడమే నా ప్రధాన లక్ష్యం. నన్నూ, నా కుటుంబాన్ని ఆరాధిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు’’ అని మనోజ్‌ పోస్ట్‌ పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని