Manchu Manoj: అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్‌

‘మిరాయ్‌’తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచనున్నారు మంచు మనోజ్‌. ఈ సినిమాలోని ఆయన లుక్‌ విడుదలైంది.

Published : 20 May 2024 17:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ కెరీర్‌ పరంగా ఒకానొక సమయంలో నిరాశ చెందానని, తర్వాత ఓపిక విలువేంటో అర్థమైందని మంచు మనోజ్‌ (Manchu Manoj) అన్నారు. ‘మిరాయ్‌’ (Mirai) ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. కొన్నాళ్ల బ్రేక్‌ అనంతరం ఆయన నటిస్తున్న సినిమాల్లో ఇదొకటి. తేజ సజ్జా (Teja Sajja) హీరోగా కార్తిక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మనోజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. సోమవారం ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని టీమ్ ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్‌ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించింది. 

అభిమానులు, ప్రేక్షకులనుద్దేశించి మనోజ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను వెండితెరపై కనిపించి ఎనిమిదేళ్లయింది. అప్పుడప్పుడు సోషల్‌మీడియా, సినీ వేడుకలు.. ఇలా ఏదో ఓవిధంగా మీకు దగ్గరగా ఉంటున్నా. కానీ, సినిమాలతోనే మిమ్మల్ని అలరించడం నాకు ఆనందం. మీకు విభిన్న కథలను పరిచయం చేయాలనేదే నా కోరిక. ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తా. డబ్బు కోసం కాకుండా మనసుకు నచ్చిన స్టోరీలను ఎంపిక చేసుకుంటూ వచ్చా. కొంత విరామం అనంతరం మళ్లీ నటించాలనుకుని.. ఎన్నో కథలు విన్నా. వాటిలో కొన్ని నచ్చలేదు. నచ్చినవి అనివార్య కారణాల వల్ల పట్టాలెక్కలేదు. ఈ క్రమంలో నిరాశ చెందా. ఓపిక విలువేంటో అర్థమైంది. ‘మనం కలిసి నటిద్దాం.. అన్నా’ అంటూ తేజ నన్ను అడిగాడు. ఆమేరకు దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని నన్ను సంప్రదించి, ‘మిరాయ్‌’ స్క్రిప్టు చెప్పారు. వినగానే నన్ను ఆకట్టుకుందా కథ. రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. పార్ట్‌ 1.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 18న విడుదలవుతుంది’’ అని తెలిపారు.

అదే వేదికపై తన స్నేహితుడు, హీరో ఎన్టీఆర్‌ (NTR)కు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ విడుదల చేస్తున్న ‘కన్నప్ప’ (Kannappa) టీమ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. తన సోదరుడు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది. ‘మిరాయ్‌’లో కీ రోల్‌ ప్లే చేస్తున్న మనోజ్‌.. హీరోగా ‘వాట్‌ ది ఫిష్‌’లో నటిస్తున్నారు. భాస్కర్‌ బంటుపల్లి దర్శకత్వంలో ఓ సినిమా ఖరారు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని