Manisha Koirala: మాధురి దీక్షిత్‌తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా

కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్‌లో తన కెరీర్‌కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు.

Published : 23 Apr 2024 13:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బొంబాయి’ (Bombay)తో దక్షిణాది సినీ ప్రియులకు చేరువైన నటి మనీషా కొయిరాలా (Manisha Koirala). ఆ సినిమా విజయం తర్వాత తమిళ, హిందీ భాషల్లో వరుస ఆఫర్లు అందుకొన్నారు. కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె త్వరలోనే ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీని ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె గతంలో ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.

‘‘యశ్‌ చోప్రా సినిమాల్లో నటించాలని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘దిల్ తో పాగల్ హై’ సినిమాను నేను తిరస్కరించాను. ఇప్పటికీ ఈ విషయంలో పశ్చాత్తాపపడుతున్నాను. ఆ సినిమా వదులుకోవడానికి కారణం నా భయమే. అందులో అప్పటికే మాధురి దీక్షిత్‌ను ఎంపిక చేశారు. ఆమెతో కలిసి నటించాలంటే భయపడ్డాను. అందుకే ఆ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగాను. ఆ తర్వాత మరో సినిమాలో ఆమెతో కలిసి నటించాల్సి వచ్చింది. ఆ చిత్రం షూటింగ్‌ సమయంలో మాధురి ఎంతగా కలిసిపోతారో తెలిసింది. ఆమె గొప్ప వ్యక్తిత్వం ఉన్న నటి. పక్కవారిని ప్రోత్సహిస్తారు.. ప్రతి సన్నివేశానికి మెరుగులు దిద్దుతారు’’ అని చెప్పారు.

తాను నటించిన ‘హీరామండీ’ వెబ్‌ సిరీస్‌ గురించి మాట్లాడుతూ.. ‘ప్రతి ఆర్టిస్టుకు మంచి కథలో నటించాలని ఉంటుంది. నేను ఈ గొప్ప ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఎంతో ఆనందంతో ఉన్నాను. దీని విడుదల ఆలస్యమైనందుకు బాధపడడం లేదు. సంజయ్‌ లీలా భన్సాలీ ఏ విషయంలోనూ రాజీ పడరు. ప్రేక్షకులకు మంచి అవుట్‌పుట్‌ ఇచ్చేందుకే ఆయన సమయం తీసుకున్నారు. ఈ సిరీస్‌ ప్రేక్షకాదరణ పొందుతుందని నాకు నమ్మకముంది’ అని చెప్పారు. ఈ సిరీస్‌ విషయానికొస్తే.. ఇందులో బాలీవుడ్‌ అందాల తారలందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారు. మనీషా కోయిరాలా, అదితి రావ్‌ హైదరీ, రిచా చద్దా, సోనాక్షి సిన్హా, షెర్మిన్‌ సెగల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే  విడుదలైన పోస్టర్లు, పాటలు సినీప్రియుల దృష్టిని ఆకర్షించాయి. హీరామండీ ప్రాంతంలోని వేశ్యల జీవితం ఆధారంగా రూపొందింది. పలు వాయిదాల తర్వాత మే1 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని