Manoj Bajpayee: ఆ హీరో డ్యాన్స్‌ చూసి.. నేను చేయడం మానేశా: మనోజ్‌ బాజ్‌పాయ్‌

ఓ హీరో డ్యాన్స్‌కు తాను ఫిదా అయ్యానని, ఆ తర్వాత తాను డ్యాన్స్‌ చేయడం మానేశానని ప్రముఖ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే?

Updated : 27 Nov 2023 11:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ చలన చిత్ర పరిశ్రమలోని విలక్షణ నటుల్లో మనోజ్‌ బాజ్‌పాయ్‌ (Manoj Bajpayee) ఒకరు. ఆయా పాత్రల మేరకు ఆయన తెరపై ఎంత సీరియస్‌గా ఉంటారో తెర వెనుక అంతే సరదాగా ఉంటారు. డ్యాన్స్‌ గురించి మాట్లాడుతూ తనలోని కామెడీ టైమింగ్‌ను మరోసారి బయటపెట్టి అలరించారు. దిల్లీ వేదికగా ఓ ఛానల్‌ నిర్వహించిన ఈవెంట్‌కు మనోజ్‌ అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై.. తాను ఎంపిక చేసుకున్న పాత్రలకు ఎలా సన్నద్ధమవుతారో వివరించారు. అనంతరం, తాను డ్యాన్స్‌ మానేయడానికి కారణమేంటో వెల్లడించారు. 

‘నీకింతటి ధైర్యమెక్కడిది.. నువ్వు తప్పు చేస్తున్నావు’.. నిర్మాతపై సముద్రఖని ఫైర్‌

‘‘కెరీర్‌ ప్రారంభంలో సినిమాల్లో నేను డ్యాన్స్‌ చేసేవాడిని. అయితే, ‘కహో నా ప్యార్‌ హై’లోని హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) చేసిన డ్యాన్స్‌కు నేను ఫిదా అయ్యా. ‘డ్యాన్స్‌ అంటే ఇదీ’ అని అనుకుని.. నేను చేయడం మానేశా. ఆ తర్వాత కొన్నాళ్లకు టైగర్‌ ష్రాఫ్‌ (Tiger Shroff) తెరంగేట్రం చేశాడు. అతడు కూడా అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తాడు. నేను సాధారణ వ్యక్తిని కాబట్టి సాధారణంగానే డ్యాన్స్‌ చేస్తా (నవ్వుతూ..). ‘సత్య’ చిత్రంలోని నా డ్యాన్స్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయింది. వారు అలానే డ్యాన్స్‌ చేసి ఆనందించారు’’ అంటూ మనోజ్‌ నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు.

తనకు బాగా గుర్తింపు తెచ్చిన పాత్రల గురించి మాట్లాడుతూ.. ‘‘సత్య’లోని భీకూ మాత్రే రోల్‌ కోసం 4 నెలలు సన్నద్ధమయ్యా. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపుర్‌’లోని సర్దార్‌ ఖాన్‌ విషయానికొస్తే.. ‘అలా ఉండాలి.. ఇలా ఉండాలి’ అంటూ నేను, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ దాని గురించి ఎంతగానో చర్చించుకున్నాం. అలా తెరకెక్కిన పాత్రకు ప్రేక్షకాదరణ దక్కింది’’ అని అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘జోరమ్‌’ (Joram) డిసెంబరు 8న విడుదల కానుంది. ‘ప్రేమకథ’, ‘హ్యాపీ’, ‘వేదం’, ‘కొమరం పులి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మనోజ్‌.. ‘ది ఫ్యామిలీమ్యాన్‌’ వెబ్‌సిరీస్‌తో మరింత క్రేజ్‌ దక్కించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు