‘నీకింతటి ధైర్యమెక్కడిది.. నువ్వు తప్పు చేస్తున్నావు’.. నిర్మాతపై సముద్రఖని ఫైర్‌

కార్తి నటించిన ‘పరుత్తివీరన్‌’ వివాదంపై నటుడు సముద్రఖని (Samuthirakani) స్పందించారు. చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌ రాజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 26 Nov 2023 11:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హీరో కార్తి (Karthi) వెండితెరకు పరిచయమైన చిత్రం ‘పరుత్తివీరన్‌’ (Paruthiveeran). దాదాపు 16 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా విషయంలో కొన్నిరోజుల నుంచి చిత్ర దర్శకుడు ఆమిర్‌, నిర్మాత జ్ఞానవేల్‌ రాజా మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ చిత్ర దర్శకుడికి తన మద్దతు తెలియజేస్తూ నటుడు సముద్రఖని (Samuthirakani) తాజాగా ఓ లేఖ విడుదల చేశారు.

‘‘పరుత్తివీరన్‌’లో నేనూ నటించాను. ఆ సినిమా తెరకెక్కించడంలో దర్శకుడు ఆమిర్‌ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో నాకు తెలుసు. (జ్ఞానవేల్‌ రాజాని ఉద్దేశించి..) నిర్మాతవైన నువ్వు మాత్రం ఒక్కరోజు కూడా సెట్‌కు వచ్చింది లేదు. సినిమా బడ్జెట్‌ విషయంలోనూ సహకరించలేదు. నా వద్ద డబ్బుల్లేవు.. నేను ఈ సినిమా చేయను.. అని షూటింగ్‌ మధ్యలోనే చేతులెత్తేశావు. బంధువుల దగ్గర నుంచి అప్పులు తీసుకువచ్చి ఆమిర్‌ ఆ సినిమా పూర్తి చేశాడు. దానికి నేనే సాక్ష్యం. ఎంతో కష్టపడి ఆయన సినిమా పూర్తి చేస్తే నిర్మాత అనే పేరు మాత్రం నువ్వు పొందావు. ఈరోజు నువ్వు దర్శకుడిని తప్పుబడుతూ వ్యాఖ్యలు చేస్తున్నావు. ఇదేం బాలేదు. నీకింత ధైర్యమెక్కడిది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు’’ అని సముద్రఖని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ లేఖ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

అవన్నీ అవాస్తవాలే.. ఫ్యాన్‌ క్లబ్స్‌కు నటి వార్నింగ్‌

అసలేం జరిగిందంటే: కార్తి హీరోగా నటించిన 25 చిత్రం ‘జపాన్‌’. జ్ఞానవేల్‌ రాజా దీనికి నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల ఆరంభంలో చెన్నై వేదికగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు కార్తితో ఇప్పటివరకూ సినిమాలు చేసిన దర్శకులందరూ హాజరయ్యారు. అయితే, తొలి చిత్ర దర్శకుడు ఆమిర్‌ మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు. దీనిపై ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘జపాన్‌’ ఈవెంట్‌కు నాకు ఆహ్వానం అందలేదు. సూర్య - కార్తితో నాకు సత్సంబంధాలు లేవు. జ్ఞానవేల్‌ రాజా మా మధ్యలోకి రావడంతోనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి’ అని చెప్పారు. దీనిపై జ్ఞానవేల్‌ రాజా స్పందిస్తూ.. ‘‘అతడికి ఆహ్వానం పంపించాం. ‘పరుత్తివీరన్‌’ విషయంలో నన్ను ఇబ్బందిపెట్టాడు. అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు నాతో ఖర్చుపెట్టించాడు. సరైన లెక్కలు చూపించకుండా నా డబ్బులు దోచుకున్నాడు’’ అని ఆరోపణలు చేశాడు. దీంతో వీరిద్దరి వివాదం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో సముద్రఖని తాజాగా బహిరంగ లేఖ రాశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని