Maruthi: ఆయనంటే నాకెంత ఇష్టమో ‘రాజా సాబ్‌’లో చూస్తారు..: మారుతి

ప్రభాస్‌ అంటే తనకెంత ఇష్టమో ‘రాజా సాబ్‌’ సినిమాలో చూస్తారని దర్శకుడు మారుతి అన్నారు.

Published : 03 Feb 2024 16:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతి (maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజా సాబ్‌’ (Raja Saab). సంక్రాంతి కానుకగా విడుదలైన దీని ఫస్ట్‌లుక్ పోస్టర్‌ అభిమానులను అలరించింది. ఇక ఈ సినిమా ప్రకటించిన రోజు నుంచి దర్శకుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కు రిప్లైలు ఇస్తూ వారిలో జోష్‌ నింపుతున్నారు. తాజాగా ‘ట్రూ లవర్‌’ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న మారుతి.. ప్రభాస్ అంటే తనకెంత ఇష్టమో చెప్పారు.

‘నేను ప్రభాస్‌కు ట్రూ లవర్‌ని. ప్రస్తుతం ఆయన ప్రేమని ఎంజాయ్‌ చేస్తున్నాను. ఆయనంటే నాకెంత ఇష్టమో ‘రాజా సాబ్‌’లో చూస్తారు. ఇది చాలా సింపుల్‌ లాజిక్‌’ అన్నారు. ఇటీవల మరో ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమా విడుదల తేదీపై స్పందిస్తూ.. ‘త్వరలోనే ప్రభాస్‌ నటించిన పెద్ద సినిమా విడుదల కానుంది. దాని అప్‌డేట్స్‌ రావాలి. ఆ చిత్రం మంచి విజయం సాధించాలి. దాని తర్వాత ‘రాజాసాబ్‌’ అప్‌డేట్స్‌ వస్తాయి. అందరూ కోరుకునే మంచి తేదీకే దీన్ని రిలీజ్‌ చేస్తాం’ అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ప్రభాస్ అభిమానులు షేర్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది విడుదలయ్యే అవకాశముందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అలా చేయడం ఆమోదయోగ్యం కాదు.. ‘పుష్ప2’ ఫొటో లీక్‌పై రష్మిక అసహనం..

‘రాజా సాబ్’ విషయానికొస్తే.. గతేడాది ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ప్రభాస్‌-మారుతిల కాంబోలో సినిమా తెరకెక్కుతోందని అధికారికంగా ప్రకటించకుండానే డైరెక్ట్‌గా ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ పోస్టర్‌తో ఆ విషయాన్ని ఖరారు చేశారు. రొమాంటిక్‌ హారర్‌ కామెడీ నేపథ్యంలో ఇది రానుంది. ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌ కథానాయికలుగా నటిస్తున్నారని టాక్‌. ప్రస్తుతం ప్రభాస్ దీనితో పాటు ‘కల్కి 2898 ఏడీ’ (Kaliki 2898 AD)లో నటిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం మే 9న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని