Malla Reddy: మహేశ్‌బాబు ‘బిజినెస్‌మేన్‌’ చూసి ఎంపీ అయ్యా.. మల్లారెడ్డి స్పీచ్‌కు మహేశ్‌బాబు నవ్వులే నవ్వులు!

Minister Malla Reddy: ‘యానిమల్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో మంత్రి మల్లారెడ్డి ప్రసంగం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది.

Updated : 28 Nov 2023 19:37 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు (Mahesh Babu) నటించిన ‘బిజినెస్‌మేన్‌’ చూసి తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆ సినిమా స్ఫూర్తితోనే ఎంపీ అయ్యానని మంత్రి మల్లారెడ్డి (Minister Malla Reddy) అన్నారు. రణ్‌బీర్‌కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్’ (Animal). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు మంత్రి మల్లారెడ్డి హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు.

‘‘మహేశ్‌బాబు ‘బిజినెస్‌మేన్‌’ చూసి రాజకీయాల్లోకి వచ్చా. ఆ సినిమా ఏకంగా పదిసార్లు చూసి ఎంపీ అయ్యాను. సేమ్‌ మోడల్‌.. సేమ్‌ సిస్టమ్‌. రణ్‌బీర్‌ కపూర్‌ గారూ మీకొక విషయం చెప్పాలనుకుంటున్నా. వచ్చే ఐదేళ్లలో మొత్తం భారతదేశం, హాలీవుడ్‌, బాలీవుడ్‌ను మా తెలుగువాళ్లు రూల్‌ చేస్తారు. ఒక ఏడాది ఆగితే మీరు హైదరాబాద్‌కు మారిపోవడం బెటర్‌. ఎందుకంటే, ముంబయి పాతబడిపోతుంది.. బెంగళూరులో ట్రాఫిక్‌ జామ్‌ ఎక్కువ.. అన్ని వసతులు కలిగిన ఏకైక నగరం హైదరాబాద్‌. తెలుగు వాళ్లు చాలా స్మార్ట్‌. మా దగ్గర రాజమౌళి (Rajamouli), దిల్‌ రాజు, ఇప్పుడు సందీప్‌రెడ్డి (sandeep reddy vanga) ఉన్నారు. మా హైదరాబాద్‌ టాప్‌లో ఉంటుంది. ‘పుష్ప’తో రష్మిక భారతదేశం మొత్తం తెలిసిపోయింది. మా మల్లారెడ్డి సంస్థల వేదికగా ఈవెంట్‌ జరుగుతోంది. మీ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ అవుతుంది. రూ.500 కోట్లకు పైగా వసూళ్లు చేయాలని కోరుకుంటాం’’ అని అంటూ తనదైన శైలిలో ప్రసంగించి ఈవెంట్‌కు కొత్త ఉత్సాహాన్ని తెచ్చారు. మల్లారెడ్డి మాటలకు కథానాయకులు మహేశ్‌బాబు, రణ్‌బీర్‌కపూర్‌, దర్శకుడు రాజమౌళి చిరునవ్వులు చిందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ట్రెండ్‌ అవుతోంది.

సందీప్‌రెడ్డి రూపొందించిన యానిమల్‌లో రష్మిక కథానాయికగా నటిస్తుండగా, బాబీదేవోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అనిల్‌కపూర్‌, శక్తికపూర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తండ్రీ-కొడుకుల అనుబంధంతో పాటు, మాస్‌ ప్రేక్షకులను అలరించేలా యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని