Mohan Babu: మోహన్‌బాబు విజ్ఞప్తి.. ఇక ఊరుకునేది లేదంటూ ట్విటర్‌లో పోస్ట్‌!

Mohan Babu: రాజకీయంగా తన పేరును అనవసరంగా ఉపయోగిస్తున్నారని, ఇక నుంచి అలా చేయొద్దని సినీ నటుడు మోహన్‌బాబు విజ్ఞప్తి చేశారు. 

Updated : 26 Feb 2024 13:37 IST

హైదరాబాద్‌: తన పేరును కొందరు వ్యక్తులు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని, అలాంటి చర్యలను అస్సలు ఉపేక్షించేది లేదని విలక్షణ నటుడు, నిర్మాత మోహన్‌బాబు (Mohan babu) అన్నారు. ఇందుకు సంబంధించి ఎక్స్‌ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. తన పేరును అనవసరంగా వాడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

‘‘ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడటంలోనే మనం దృష్టి పెట్టాలిగానీ, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి, వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని  హెచ్చరిస్తూ.. ధన్యవాదాలతో మీ మోహన్‌బాబు’’ అంటూ పోస్ట్‌ పెట్టారు.

ప్రస్తుతం ఆయన తన తనయుడు మంచు విష్ణుతో (Vishnu Manchu) కలిసి ‘కన్నప్ప’లో (Kannappa) నటిస్తున్నారు.  శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీకి ముకేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రూ.100కోట్ల భారీ బడ్జెట్‌ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. విష్ణు శివ భక్తుడిగా దర్శనమివ్వబోతున్నారు. ప్రభాస్‌, మోహన్‌లాల్‌ అతిథి పాత్రల్లో కనిపించనున్నారని టాక్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని