Web Series: అందరి చూపు.. ఈ సిరీస్‌ల సీక్వెల్స్‌ వైపు.. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు?

ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెబ్‌సిరీస్‌ల సీక్వెల్స్‌ వివరాలివీ..

Updated : 27 Feb 2024 10:05 IST

సినిమాలకే కాదు వెబ్‌సిరీస్‌లకూ సీక్వెల్స్‌ వస్తున్నాయి. ‘ఎంత చెప్పినా కథ ఇంకా మిగిలే ఉంది’ అన్నట్లు సీజన్లపై సీజన్లు రూపొందుతున్నాయి. భాషా భేదం లేకుండా ప్రేక్షకులంతా వాటి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ సిరీస్‌లేంటి? ఇప్పుడు ఎన్నో సీజన్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నాయో చూద్దాం..

ది ఫ్యామిలీమ్యాన్‌..

ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో అత్యధిక వ్యూస్‌ సొంతం చేసుకున్న సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ (The Family Man) ఒకటి. నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) విభాగంలో పనిచేసే వ్యక్తికి ఎదురయ్యే సవాళ్లే ఇతివృత్తంగా రూపొందిందీ సిరీస్‌. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్‌ అండ్‌ డీకే దర్శకులు. ఫస్ట్‌ సీజన్‌ 2019 సెప్టెంబరు 20న విడుదలై, ప్రేక్షకులకు థ్రిల్‌ పంచింది. దీంతో, సీజన్‌ 2పై ఆసక్తి నెలకొంది. ప్రముఖ హీరోయిన్‌ సమంత కీలకపాత్ర పోషించడంతో అంచనాలు భారీగా నమోదయ్యాయి. అలా.. 2021 జూన్‌ 4న రిలీజైన పార్ట్‌ 2.. పార్ట్‌1కు మించిన విజయం అందుకుంది. పార్ట్‌ 2కు మించి పార్ట్‌ 3 ఉంటుందని మనోజ్‌ బాజ్‌పాయ్‌ (Manoj Bajpayee) ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వయసు పెరిగినా శ్రీకాంత్‌ తివారీ (సిరీస్‌లో తాను పోషించిన పాత్ర)ని సవాళ్లు వెంటాడుతూనే ఉంటాయని తెలిపారు. సీజన్‌ 3 (The Family Man 3) చిత్రీకరణ అతి త్వరలో ప్రారంభం కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో వచ్చే ఏడాది విడుదల కానుంది.

మీర్జాపూర్‌..

మీర్జాపూర్‌లో అఖండానంద్‌ అనే మాఫియా డాన్‌ ఉంటాడు. అక్కడ ఆయన మాటే శాసనం. ఆయన తనయుడు మున్నాకి, ఓ సాధారణ లాయర్‌, ఆయన కుమారులు గుడ్డు, బబ్లూల మధ్య వైరం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ‘మీర్జాపూర్‌’ సిరీస్‌ (Mirzapur) కథాంశం. అలీ ఫజల్‌, విక్రాంత్‌ మస్సే (Vikrant Massey), పంకజ్‌ త్రిపాఠి (Pankaj Tripathi), దివ్యేందు (Divyenndu) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ క్రైమ్‌ థిల్లర్‌కు కరణ్‌ అన్షుమాన్‌ దర్శకుడు. 2018 నవంబరు 12న సీజన్‌ 1, 2020 అక్టోబరు 23న సీజన్‌ 2 విడుదలై, ఆకట్టుకున్నాయి. ఇటీవల సీజన్‌ 3 చిత్రీకరణ పూర్తయింది. పార్ట్‌ 3 (Mirzapur 3) కూడా ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లోనే స్ట్రీమింగ్‌ కానుంది.

మహారాణి..

రాజకీయం నేపథ్యంలో రూపొందిన సిరీస్‌ (Maharani) ఇది. హ్యుమా ఖురేషీ (Huma Qureshi) ప్రధాన పాత్రధారి. పెద్దగా చదువుకోని ఓ మహిళ ప్రభుత్వంలోని పెద్దలతో తలపడాల్సి వచ్చినప్పుడు ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? వ్యవస్థతో ఆమె ఎలా పోరాడింది అన్నది కథాంశం. సీజన్‌ 1కు (2021 మే 28న విడుదల) కరణ్‌ శర్మ, సీజన్‌ 2కు (2022 జులై 16న విడుదల) రవీంద్ర గౌతమ్‌ దర్శకత్వం వహించారు. రెండింటికీ మంచి ఆదరణ దక్కడంతో సీజన్‌ 3 పట్టాలెక్కింది. సౌరభ్‌ భావే డైరెక్షన్‌లో రూపొందిన పార్ట్‌ 3 (Maharani 3) మార్చి 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: సోనీలివ్‌ (SonyLiv).

పంచాయత్‌..

ఉద్యోగావకాశాలు లేక ఓ మారుమూల గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా విధుల్లోకి చేరతాడు ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన అభిషేక్‌ త్రిపాఠి. అక్కడ ఆయనకు ఎదురైన అనుభవాలేంటన్నదే పంచాయత్‌ (Panchayat) వెబ్‌ సిరీస్‌ స్టోరీ. ఈ కామెడీ డ్రామా సిరీస్‌లో అభిషేక్‌ త్రిపాఠిగా నటించిన జితేంద్రకుమార్‌ (Jitendra Kumar) మంచి మార్కులు కొట్టేశారు. దీపక్‌ కుమార్‌ మిశ్రా దర్శకుడు. 2020 ఏప్రిల్‌ 3న సీజన్‌1, 2022 మే 20న సీజన్‌ 2 విడుదలయ్యాయి. సీజన్‌ 3 మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video).

బ్రీత్‌..

కిడ్నాప్‌నకు గురైన కుమార్తెను కాపాడుకోవడంలో డాక్టర్‌ అవినాష్‌ సభర్వాల్‌ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ఆ కిడ్నాపర్‌ డిమాండ్‌ ఏంటి? తదితర అంశాలతో రూపొందింది ‘బ్రీత్‌: ఇన్‌టూ ది షాడోస్‌’ (Breathe: Into the Shadows) సిరీస్‌. డాక్టర్‌ అవినాష్‌గా అభిషేక్‌ బచ్చన్‌ (Abhishek Bachchan) నటించారు. నిత్యా మేనన్‌ (Nithya Menen) కీలకపాత్ర పోషించారు. ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌కు మయాంక్‌శర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తిచేసుకున్న ఈ సిరీస్‌ సీజన్‌ 3తో ప్రేక్షకులకు థ్రిల్‌ పంచేందుకు సిద్ధమైంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video).

దిల్లీ క్రైమ్‌..

2012లో దిల్లీలో జరిగిన వాస్తవ సంఘటనల (ఓ అమ్మాయి గ్యాంగ్‌ రేప్‌) ఆధారంగా రిచీ మెహతా, తనూజ్‌ చోప్రా ఈ సిరీస్‌ని (Delhi Crime) రూపొందించారు. డీసీపీ వర్థికా చతుర్వేదిగా షెఫాలీ షా (Shefali Shah) ప్రేక్షకులను కట్టి పడేశారు. ‘ప్రైమ్‌టైమ్‌ ఎమ్మీ అవార్డు ఫర్‌ అవుట్‌స్టాండింగ్‌ డ్రామా సిరీస్‌’ పురస్కారం అందుకున్న తొలి భారతీయ వెబ్‌సిరీస్‌ ఇదే. మూడో సీజన్‌ (Delhi Crime 3) త్వరలో ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో విడుదల కానుంది.

ఆశ్రమ్‌..

దేవుడి ప్రతినిధిగా నిరాలా బాబాను భక్తులు ఏవిధంగా కొలిచేవారు? ఆయన ఆశ్రమంలో జరిగిన అత్యాచారం, హత్యల వెనక ఉన్నది ఎవరు? చివరకు బాబా పరిస్థితి ఏమైంది? తదితర అంశాలతో ప్రకాశ్‌ ఝా ఈ సిరీస్‌ని (Aashram) రూపొందించారు. బాబా, మాంటీసింగ్‌ పాత్రల్లో బాబీ దేవోల్‌ (Bobby Deol) వైవిధ్యం ప్రదర్శించి, అలరించారు. 2020లో సీజన్‌ 1, సీజన్‌ 2, 2022లో సీజన్‌ 3 విడుదల కాగా సీజన్‌ 4 (Aashram 4) ఈ ఏడాది చివరిలో వచ్చే అవకాశాలున్నాయి. ‘ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌’ (MX Player)లో స్ట్రీమింగ్‌ కానుంది.

సీజన్‌ 2తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న సిరీస్‌లు..

  • రానా నాయుడు (నెట్‌ఫ్లిక్స్‌): ఈ ఏడాదిలో విడుదల కావొచ్చు
  • కాలాపానీ (నెట్‌ఫ్లిక్స్‌): త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది
  • దూత (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో): ఈ సంవత్సంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి
  • ఫర్జీ (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో): ఈ ఏడాది చివరిలో లేదా 2025లో..

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని