Adipurush: ‘ఆదిపురుష్‌’.. వాళ్లను ఎప్పటికీ క్షమించకూడదు: నిప్పులు చెరిగిన ‘శక్తిమాన్‌’

‘ఆదిపురుష్‌’ (Adipurush)పై మరోసారి నిప్పులు చెరిగారు నటుడు ముఖేశ్‌ ఖన్నా (Mukesh Khanna). చిత్రదర్శకుడు ఓంరౌత్‌ (Om Raut), మాటల రచయిత మనోజ్‌కు రామాయణంపై కాస్త కూడా అవగాహన లేదన్నారు.  

Published : 21 Jun 2023 19:52 IST

ముంబయి: ‘ఆదిపురుష్‌’ (Adipurush)పై మరోసారి నిప్పులు చెరిగారు ‘శక్తిమాన్‌’ నటుడు ముఖేశ్‌ ఖన్నా (Mukesh Khanna). రామాయణాన్ని వెండితెరపై ఆవిష్కృతం చేయడంలో విఫలమైన ‘ఆదిపురుష్‌’ మేకర్స్‌ను ఎప్పటికీ క్షమించకూదని అన్నారు. ‘‘మన గ్రంథాలను అవమానించే హక్కు వాళ్లకు (మేకర్స్‌ను ఉద్దేశిస్తూ) ఎవరిచ్చారు. నాకు తెలిసినంత వరకూ చిత్ర దర్శకుడు ఓంరౌత్‌, మాటల రచయిత మనోజ్‌ శుక్లా రామాయణన్ని చదవలేదు. (రావణాసురుడు బ్రహ్మ నుంచి వరం పొందాడని చూపించిన సీన్‌ను ఉద్దేశిస్తూ..) రావణాసురుడు శివుడు నుంచి వరం పొందాడనే విషయం కూడా తెలియని వాళ్లు.. ఇప్పుడు పెద్ద పెద్ద విషయాలపై మాట్లాడుతున్నారు. కచ్చితంగా ఇదొక దారుణమైన చిత్రం. వాళ్లను ఏమాత్రం క్షమించకూడదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, ‘రామాయణ్‌’ సీరియల్‌లో సీత పాత్ర పోషించిన దీపికా చిక్లియా సైతం ఈ సినిమా గురించి మాట్లాడారు. ఇకపై, రామాయణాన్ని ఎవరూ సినిమాగా రూపొందించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ‘‘ఆదిపురుష్‌’పై నేను కామెంట్స్‌ చేయాలనుకోవడం లేదు. నేనింకా ఆ చిత్రాన్ని వీక్షించలేదు కూడా. కాకపోతే,  రామాయణం మన వారసత్వం. దీనిపై ఎలాంటి సినిమాలు చేయకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే రామాయణాన్ని ఆధారంగా చేసుకుని సినిమాని తీసిన ప్రతిసారీ ఏదో ఒక విధంగా వివాదం తలెత్తుతూనే ఉంది. రామాయణం ఎంతో పవిత్రమైనది’’ అని ఆమె అన్నారు.

మరోవైపు, ‘ఆదిపురుష్‌’ చుట్టూ వివాదం నెలకొన్న తరుణంలో దీపిక.. సీత గెటప్‌లో ఫొటోలు దిగి ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. అభిమానుల కోరిక మేరకే తాను ఈ ఫొటోలు షేర్‌ చేశానని అన్నారు. వాటిని చూసిన పలువురు నెటిజన్లు.. ‘‘సీత పాత్రకు మీలా ఎవరూ న్యాయం చేయరు’’ అని ప్రశంసలు కురిపించారు.

‘ఆదిపురుష్‌’ను ఇప్పటికే ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. కొంత మంది సినిమాలోని పాత్రల చిత్రీకరణ తప్పు పట్టగా.. మరి కొంతమంది హనుమంతుడి మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయణ మహాకావ్యంలో అమర్యాదకరమైన సంభాషణలు ఉపయోగించడం ఏమిటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై స్పందించిన చిత్రబృందం సినిమాలోని పలు డైలాగ్స్‌ను మార్చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని