Adipurush: ‘ఆదిపురుష్‌’పై ‘శక్తిమాన్‌’ తీవ్ర విమర్శలు

‘ఆదిపురుష్‌’ (Adipurush)ను ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు నటుడు ముఖేశ్‌ ఖన్నా (Mukesh Khanna). ఇలాంటి చిత్రానికి రూ.600 కోట్లు ఎలా ఖర్చు చేశారోనని ఆయన అన్నారు.

Published : 19 Jun 2023 23:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆదిపురుష్‌’ (Adipurush)పై ‘శక్తిమాన్‌’ పాత్రధారి ముఖేశ్‌ ఖన్నా (Mukesh Khanna) తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటివరకూ వచ్చిన ఏ రామాయణ రచనలతోనూ ఈ సినిమాకు పోలిక లేదన్నారు. సినిమాటిక్‌ లిబర్టీ (చిత్రీకరించడంలో స్వేచ్ఛ) తీసుకోవాలనుకుంటే ఫిక్షనల్‌ సినిమాలు తీయాలి కానీ,  ఇలాంటివి తెరకెక్కించకూడదన్నారు. ఈ మేరకు ఆయన ‘ఆదిపురుష్‌’పై తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఓ వీడియో షేర్‌ చేశారు.

‘‘రామాయణానికి ‘ఆదిపురుష్‌’ను మించిన అగౌరవం మరొకటి ఉండదు. చిత్ర దర్శకుడు ఓంరౌత్‌కు రామాయణంపై కొద్దిగా కూడా పరిజ్ఞానం లేదు. మనోజ్‌ రాసిన పేలవమైన డైలాగ్స్‌, నిద్రపుచ్చే స్క్రీన్‌ప్లే చూసి నిద్రమాత్రలు కూడా సిగ్గుపడతాయి. ఇప్పటి వరకూ ఎంతోమంది రచయితలు రామాయణాన్ని తమదైన శైలిలో రచించారు. ఆ రచనలు వేటితోనూ ఈ సినిమాకు పోలికలు ఉండవు. హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఓంరౌత్‌ దీన్ని రూపొందించారని సినిమా చూస్తేనే అర్థమవుతోంది. సినిమాటిక్‌ స్వేచ్ఛ తీసుకోవాలనుకుంటే.. ఫిక్షనల్‌ సినిమా చేయాల్సింది. కథను అవమానించేలా చూపించకూడదు. ‘ఆదిపురుష్‌’.. భయానకమైన జోక్‌. ఒళ్లంతా టాటూలతో డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్‌కు ఇంద్రజిత్తు లుక్‌ ఏమాత్రం తీసిపోదు’’

‘‘ఇక, నాకు తెలిసినంతవరకూ రావణాసురుడు ఒక పండితుడు. అలాంటి ఆయన్ని భయపెట్టే విధంగా చూపించాలనుకుంటే ఇలా మాత్రం చూపించరు. ప్రభాస్‌ ఎంతో మంచి వ్యక్తి. అలాగే గొప్ప నటుడు. కాకపోతే, ఇది అన్ని సినిమాల్లా కాదు. ‘రామాయణ్‌’ ధారావాహికలోని అరుణ్‌ గోవిల్‌ పాత్రను చూసి స్ఫూర్తి పొందాల్సింది. మన ఇతిహాసాల్లోని పాత్రల చిత్రీకరణ మార్చే హక్కు మీకు లేదు. రామాయణం గురించి ‘ఆదిపురుష్‌’ మేకర్స్‌ కంటే కూడా సాధారణ పిల్లాడికి బాగా తెలుసు. రామానంద్‌ సాగర్‌ చిత్రీకరించిన ‘రామాయణ్‌’ సీరియల్‌తోపాటు పలు రూపాల్లో రామాయణం గురించి తెలుసుకున్నాం. ఒకవేళ మీరు కనుక ఈ చిత్రాన్ని చూడాలనుకుంటే దయచేసి మీ బ్రెయిన్‌ను ఇంట్లో వదిలేసి థియేటర్‌కు వెళ్లండి. హనుమంతుడు నిజంగా ఈ  సినిమాలోని తన గెటప్‌ చూస్తే.. తప్పకుండా మేకర్స్‌ మీదకు ఒక పర్వతాన్ని విసురుతాడు. ‘ఈ సినిమాను సెన్సార్‌ బోర్డ్‌ ఎలా అంగీకరించింది?’ అని పలువురు నన్ను అడిగారు. ఒకవేళ ఆ బోర్డ్‌ కనుక తన విలువలు మర్చిపోతే మనం గుర్తుచేద్దాం. ఇలాంటి సినిమాకు రూ.600 కోట్లు ఎలా ఖర్చు చేశారో అర్థం కావడం లేదు’’ అని ముఖేశ్‌ ఖన్నా విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని