Nabha Natesh: చనిపోతానేమో అనుకున్నా.. ఆ ఘటన నన్ను చాలా మార్చేసింది : నభా నటేశ్‌

హీరోయిన్‌ నభా నటేశ్‌ (Nabha Natesh) తనకు జరిగిన రోడ్డు ప్రమాదాన్ని మరోసారి గుర్తుచేసుకుంది. ఆ ప్రమాదం తనను చాలా మార్చేసిందని తెలిపింది.

Published : 05 Mar 2023 16:14 IST

హైదరాబాద్‌: ‘ఇస్మార్ట్‌ శంకర్‌’(Ismart Shankar) సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకుంది హీరోయిన్‌ నభా నటేశ్‌ (Nabha Natesh). తనకు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి ఇటీవల సోషల్‌మీడియాలో తెలిపి అందరినీ ఆశ్చర్యపరచింది. అందుకే తను సినిమాలు చెయ్యలేదని చెప్పింది. తాజాగా నభా నటేశ్‌ మరోసారి ఆ ప్రమాదాన్ని గుర్తుచేసుకుంది. అప్పుడు తాను చనిపోతానేమో అనేంత భయం వేసిందని చెప్పింది. 

తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ..‘‘నేను నటించిన కొన్ని సినిమాలు త్వరలోనే విడుదలకానున్నాయి. ఇకపై సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తపడుతున్నా. నా పాత్రకు ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే ఓకే చెప్పాలనుకుంటున్నా’’ అని చెప్పింది. ఇక తన రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుతూ..‘‘నాకు కోలుకోవడానికి సంవత్సరం పట్టింది. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. నేను పూర్తిగా కోలుకున్నా.కానీ ఆ సమయంలో చనిపోతానేమో అనేంత భయం వేసింది. రోడ్డు ప్రమాదం జరిగిన చాలా రోజులకు నేను దాని గురించి చెప్పాను. నా భుజం ఎముక విరిగింది. దానికి చాలా శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది.  చాలా ఇబ్బంది పడ్డాను. కానీ మన జీవితంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనల్ని ఎంతమంది ఇష్టపడుతున్నారో తెలుస్తుంది. నేను ఇప్పుడు శారీరకంగా, మానసికంగా బలంగా ఉన్నాను’’ అని తెలిపింది.  

రోడ్డు ప్రమాదం కారణంగా తాను కోల్పోయిన అవకాశాల గురించి నభా నటేశ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను దీని కారణంగా ఎన్నో మంచి ప్రాజక్టుల్లో అవకాశాలు కోల్పోయాను. కానీ వాటి కోసం ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉండడం అన్నిటికంటే ముఖ్యమైన విషయమని తెలుసుకున్నా. ఇక గతంలో సోషల్‌మీడియాకు కూడా ఎక్కువ ప్రాధాన్యమిచ్చేదాన్ని కానీ ఇప్పుడు అది చివరిస్థానంలో ఉంది. లైకులు, కామెంట్స్‌, ఫాలోయర్స్‌.. ఇవేవీ పట్టించుకోవడం లేదు’’ అంటూ ఆ ప్రమాదం తనని ఎంతో మార్చేసిందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని