Naga Chaitanya: తండేల్‌.. నా కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రం: నాగచైతన్య

నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ‘తండేల్‌’ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Updated : 28 May 2024 19:41 IST

Thandel Movie: (హైదరాబాద్‌): ‘తండేల్‌’ మూవీలోని తన పాత్ర కోసం తొమ్మిది నెలల పాటు కష్టపడ్డానని నాగచైతన్య (Naga Chaitanya) అన్నారు. ఆయన కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సాయిపల్లవి (Sai Pallavi) కథానాయిక. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘‘ఓటీటీలకు ఆదరణ ఎక్కువగా ఉన్న ఈ కాలంలో ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలంటే ఏదో కొత్తగా చూపించాలి. అద్భుతమైన విజువల్స్‌తోనే అది సాధ్యం. అయితే, అదొక్కటే సరిపోదు. ప్రస్తుతం మార్కెట్‌కు ఏది అవసరమో దాన్ని గుర్తించి ప్రేక్షకులకు అందించాలి. రాసుకున్న కథ, దాని పరిధి మేరకు సహజత్వం తీసుకురావడమన్నది ఎంతో అవసరం. మరీ ముఖ్యంగా కథలోని పాత్రలకు నటీనటులు చక్కగా సరిపోవాలి. ‘తండేల్‌’ కోసం నేను 9 నెలల పాటు సిద్ధమయ్యా. ఇదొక స్ఫూర్తిమంతమైన కథ. శ్రీకాకుళం యాసతో సహా నా పాత్ర కోసం అవసరమైన ప్రతీదానిని నేర్చుకున్నా. నా కెరీర్‌లోనే ఇదొక భారీ చిత్రమవుతుంది’’ అని చైతన్య చెప్పుకొచ్చారు.

మత్స్యకార యువకుడిగా నాగచైతన్య ఇందులో నటిస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథగా చందూ దీన్ని తీర్చిదిద్దుతున్నారు. సముద్రం ఇతివృత్తంగా సాగే కథ కావడంతో విజువల్స్‌పరంగానూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ముఖ్యంగా అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ అద్భుతంగా ఉంటాయని చెబుతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్‌ పూర్తయింది. చైతూ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.40 కోట్లకు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) మూవీ రైట్స్‌ను దక్కించుకుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘తండేల్‌’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. థియేట్రికల్‌ రన్‌ ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న  ఈ చిత్రాన్ని బన్ని వాస్‌ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని