Nani: మణిరత్నం సినిమాలు చూసి చాలా టెక్నిక్స్‌ నేర్చుకున్నా : నాని

నాని నటించిన తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’(Hi Nanna). ఈ సినిమా ప్రమోషన్స్‌తో ఆయన బిజీగా ఉన్నారు.

Published : 04 Dec 2023 14:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘హాయ్‌ నాన్న’ అంటూ ఫాదర్‌ సెంటిమెంట్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు హీరో నాని (nani). డిసెంబర్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఆయన వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు. 

‘నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’, ‘దళపతి’ చిత్రాలు టీవీలో ఎన్నోసార్లు చూశాను. ఆ సమయంలో దర్శకుడెవరో కూడా నాకు తెలియదు. కానీ, ఆ సినిమాలను మాత్రం ఎప్పుడు వచ్చినా చూసేవాడిని. అవి చూడడం ప్రారంభించాకే దర్శకుడు ఎలా ఆలోచిస్తాడు.. సన్నివేశాలను ఎలా చిత్రీకరిస్తున్నాడు.. ఇలాంటి విషయాలపై ఆసక్తి కలిగింది. ఆయన సినిమాలు మాత్రమే కథతో పాటు అన్ని విషయాల గురించి ఆలోచించేలా ఉంటాయి. ప్రతి సన్నివేశంపై దృష్టిపెట్టేలా చేస్తాయి. ఆయన సినిమాల నుంచి మేకింగ్ టెక్నిక్స్‌ చాలా నేర్చుకున్నా’ అని చెప్పారు.

ఇక శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) తాజాగా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు  ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాకు క్లీన్‌ యూ(U) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. నాని సరసన మృణాల్ ఠాకూర్‌ నటించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కీలకపాత్ర పోషించారు.

ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం.. చట్టపరమైన చర్యలు తీసుకున్న కృతి సనన్‌

ఇక తాజాగా నాని (nani) తిరుమలలో సందడి చేశారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తిరుపతి వెళ్లిన ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ‘హాయ్‌ నాన్న’ ప్రచారం కోసం నాని విదేశాలకు వెళ్లనున్నారు. అక్కడి ప్రేక్షకులతో కలిసి డిసెంబర్‌ 6న ప్రీమియర్‌ను వీక్షించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని