Sheena Bora Case: ఓటీటీలోకి సంచలన ‘షీనా బోరా కేసు’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై రూపొందించిన డాక్యుమెంటరీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 29 Jan 2024 12:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది స్ట్రీమింగ్‌ కానుంది. ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్‌ ట్రూత్‌’ పేరుతో ఫిబ్రవరి 24 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. షానా లెవీ, ఉరాజ్ బహల్‌ కీలక పాత్రలు పోషించారు.

ఏంటీ షీనా బోరా హత్య కేసు..

2012లో షీనా బోరా హత్య జరగ్గా.. మూడేళ్ల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్‌ను విచారించగా.. దీన్ని బయటపెట్టాడు. షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపేసిందని తెలిపాడు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఇంద్రాణీ మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత తన కుమార్తె షీనా, కుమారుడు మైఖెల్‌ను గువాహటిలోని తల్లిదండ్రుల వద్ద ఉంచేసింది. కొన్నాళ్లకు సంజీవ్‌ ఖన్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుని, అతడి నుంచీ విడిపోయింది. తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్‌ పీటర్‌ ముఖర్జియాను పెళ్లి చేసుకుంది. పెద్దయ్యాక తల్లి గురించి తెలుసుకున్న షీనా.. ముంబయికి వెళ్లి ఆమెను కలిసింది.

Munawar Faruqui: బిగ్‌బాస్‌ విజేతగా మునావర్‌ ఫారూఖీ

పీటర్‌ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనాకు పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. ఈ విషయంలో తల్లీకుమార్తెల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆర్థిక విభేదాలూ తలెత్తాయి. దీంతో విసిగిపోయిన ఇంద్రాణీ.. తన రెండో భర్త సంజీవ్‌, డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ సాయంతో కుమార్తెను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మృతదేహాన్ని రాయ్‌గఢ్‌లోని ఓ అటవీ ప్రాంతంలో దహనం చేసినట్లు తెలిసింది. 2015లో ఈ విషయం వెలుగులోకి రాగా.. పోలీసులు ఆ అటవీ ప్రాంతానికి వెళ్లి షీనా అవశేషాలను స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కేసులో ఇంద్రాణీ, సంజీవ్‌లతో పాటు పీటర్‌ని కూడా అరెస్టు చేశారు. జైల్లోనే ఇంద్రాణీ - పీటర్ వివాహ బంధానికి ముగింపు పడింది. 2019లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని