Cinema News: మోహన్‌లాల్‌ 360 షురూ

ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్‌లాల్‌.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్‌360’ (వర్కింగ్‌ టైటిల్‌). తరుణ్‌ మూర్తి తెరకెక్కిస్తున్నారు.

Updated : 24 Apr 2024 12:08 IST

ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్‌లాల్‌.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్‌360’ (వర్కింగ్‌ టైటిల్‌). తరుణ్‌ మూర్తి తెరకెక్కిస్తున్నారు. ఇందులో మోహన్‌లాల్‌కి జోడీగా సీనియర్‌ నటి శోభన కనిపించనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న 56వ చిత్రమిది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని ఫొటోల్ని పంచుకున్నారు మోహన్‌లాల్‌. ‘‘నా 360వ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టానని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంద’’ని వ్యాఖ్యల్ని జోడించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెజాపుత్ర విజువల్‌ మీడియా పతాకంపై ఎమ్‌.రెంజిత్‌ నిర్మిస్తున్నారు.


ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబానికీ నచ్చే చిత్రం

సుమన్‌ తేజ్‌, గరీమ చౌహాన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. సతీష్‌ పరమవేద దర్శకత్వం వహించగా, రాచాల యుగంధర్‌ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. ఎమ్మెల్యే జి.మధూసూదన్‌ రెడ్డితోపాటు, దర్శకులు విజయ్‌ కనకమేడల, యాటా సత్యనారాయణ, నటుడు రమణారెడ్డితోపాటు, హసీం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర దర్శకుడు సతీష్‌ పరమవేద మాట్లాడుతూ ‘‘ఎలా బతకాలో చెబుతుంది మన రామాయణం. సీత కోసం రాముడు చేసిన యుద్ధం స్ఫూర్తితోనే ఈ కథ రాశా. మహిళలు ఎదుర్కొనే సమస్యల్ని ఓ భావోద్వేగ ప్రయాణంతో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశా. ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబానికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. నిర్మాత రాచాల యుగంధన్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడు సతీష్‌, సంగీత దర్శకుడు చరణ్‌ అర్జున్‌, నటులు సుమన్‌, గరిమ, గగన్‌ విహారి... ఇలా ప్రతి ఒక్కరూ సినిమాపై తపనతో పనిచేశారు. అందుకే ఇంత మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. మా సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘మంచి కథ, మంచి పేరుతో రూపొందించిన ఈ చిత్రం తప్పక విజయవంతం అవుతుంద’’న్నారు అతిథులు. ఈ కార్యక్రమంలో గౌతమ్‌ కృష్ణ, దేవరాజ్‌, నిర్మాతలు సెవెన్‌హిల్స్‌ సతీష్‌, సత్యనారాయణ, గగన్‌ విహారి తదితరులు పాల్గొన్నారు.


పడమటి కొండల్లో యాక్షన్‌

అనురూప్‌ కటారి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘పడమటి కొండల్లో’. నరేశ్‌ పెంట దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే స్వరకర్త. జయకృష్ణ దురుగడ్డ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని ప్రముఖ కథానాయకుడు సాయిదుర్గా తేజ్‌ విడుదల చేశారు. ‘‘యాక్షన్‌  ప్రధానంగా సాగే ఓ ప్రేమకథతో రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకులకు ఓ విభిన్నమైన అనుభవాన్ని పంచేలా విజువల్స్‌ ఉంటాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాల్ని వెల్లడిస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. యశస్వి శ్రీనివాస్‌, శ్రావ్య రెడ్డి, మురళీకృష్ణంరాజు, లతీశ్‌ జవ్వాది, మురళీరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కన్నన్‌ మునిస్వామి, సంభాషణలు: ఆర్‌.రాము.


నయా సూపర్‌ హీరో

మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి మరో సూపర్‌ హీరో చిత్రం ‘డెడ్‌పూల్‌ అండ్‌ వోల్వారిన్‌’ సందడి మొదలైంది. జులై 26న రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. ర్యాన్‌ రేనాల్డ్స్‌, హ్యూ జాక్‌మన్‌ ప్రధాన పాత్రలో షాన్‌ లెవీ తెరకెక్కించారు. మార్వెల్‌ స్టూడియోస్‌, 21 లాప్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘‘మార్వెల్‌ నుంచి వస్తున్న నయా సూపర్‌ హీరో మరోసారి ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తాడు. డెడ్‌పూల్‌గా ర్యాన్‌ రేనాల్డ్స్‌ చేసే సందడి ఆకట్టుకుంటుంది. పూర్తిస్థాయి యాక్షన్‌ అడ్వంచర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సాహసాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఈ చిత్రం భారతదేశంలో ఇంగ్లిష్‌తోపాటు, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని