Salaar: ‘సలార్‌’ ఫీవర్‌ షురూ.. తొలి టికెట్‌ ధర ఎంతో తెలుసా..?

ప్రభాస్‌ (prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prasanth neel) తెరకెక్కించిన చిత్రం ‘సలార్‌’ (Salaar). డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 16 Dec 2023 17:32 IST

ఇంటర్నెట్‌డెస్క్: ప్రభాస్‌ (Prabhas) అభిమానులందరూ ఎదురుచూస్తోన్న ‘సలార్‌’ (Salaar) మరో ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ‘సలార్‌’ సందడి మొదలైంది. ఆన్‌లైన్‌ వేదికగా టికెట్స్‌ బుకింగ్స్‌ ప్రారంభించే క్షణం కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రభాస్‌ అభిమానుల కోసం తాను ‘సలార్‌’ టికెట్స్‌ పంచనున్నట్లు నటుడు నిఖిల్‌ (Nikhil) తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్‌ చేశారు.

‘‘శ్రీరాములు థియేటర్‌లో తెల్లవారుజామున ఒంటిగంట షోకు సంబంధించి ప్రభాస్‌ డై హార్ట్‌ ఫ్యాన్స్‌కు 100 టికెట్స్‌ ఇవ్వనున్నా. దాదాపు పదేళ్ల క్రితం ఈ థియేటర్‌లో.. అదే సమయానికి ప్రభాస్‌ నటించిన ‘మిర్చి’ చిత్రాన్ని చూశాను. (మిర్చి విజయాన్ని ఉద్దేశిస్తూ..) హిస్టరీ రిపీట్‌ చేద్దాం’’ అని ఆయన రాసుకొచ్చారు. అభిమానుల కోరిక మేరకు తాను టికెట్స్‌ పంచుతున్నట్లు నిఖిల్‌ తెలిపారు.

Vignesh Shivan: ఇదే కనుక రిపీటైతే చర్యలు తీసుకుంటా: విఘ్నేశ్‌ శివన్‌పై దర్శకుడి ఆగ్రహం

తొలి టికెట్‌..!

‘సలార్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ఓ ప్రత్యేక ఇంటర్వ్యూను ప్లాన్‌ చేసింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) దీనికి హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌నీల్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ప్రభాస్‌ ఈ ఇంటర్వ్యూలో పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి. సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను వాళ్లు ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారని, ఇప్పటికే షూటింగ్‌ కూడా పూర్తైందని, త్వరలో టెలికాస్ట్‌ కానుందని సమాచారం. ఇందులో భాగంగానే ‘సలార్‌’ తొలి టికెట్‌ను రాజమౌళి కొనుగోలు చేశారని.. ఈ మేరకు నైజాంలో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాత నవీన్‌.. రాజమౌళికి టికెట్‌ను అందజేసినట్లు ఉన్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ టికెట్‌ ధర రూ.10,116 అని టాక్‌.

శ్రుతిహాసన్‌ హోస్ట్‌..!

‘కేజీయఫ్‌’, ‘కేజీయఫ్‌ 2’ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సలార్‌’. రెండు భాగాల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్‌ 22న ‘సలార్‌ పార్ట్‌ 1 సీజ్‌ఫైర్‌’ పేరుతో తొలి భాగాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ప్రభాస్‌ పాత్రల మధ్య స్నేహాన్ని ఎక్కువగా చూపించనున్నారు. ఇందులో భాగంగానే చిత్రబృందం వీరిద్దరితో స్పెషల్‌ ఇంటర్వ్యూ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనిని ‘సలార్‌’ కథానాయిక శ్రుతిహాసన్‌ హోస్ట్‌ చేయనున్నట్లు సమాచారం. ‘సలార్‌’ ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలపై జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయా ఇంటర్వ్యూల కోసం ఎదురుచూస్తున్నామంటూ ఫ్యాన్స్‌ ట్వీట్స్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని