Salaar: ‘సలార్‌’ చిత్ర బృందం కీలక నిర్ణయం.. నటీనటులను హెచ్చరించిందా?

సలార్‌ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రైలర్‌ను అందించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ‘సలార్‌’ టీమ్‌ కీలక నిర్ణయం తీసుకుందట.

Updated : 08 Aug 2023 15:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ఫైర్‌’. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్‌ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ గ్లింప్స్‌నకు మంచి స్పందన రాగా, ట్రైలర్‌ కోసం అభిమానులు వేచిచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాలో పనిచేస్తున్న నటీనటులు ఎవరూ ఏ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని ఆదేశాలు పంపింది. ట్రైలర్‌ విడుదల చేసే వరకూ ఎవరూ సోషల్‌మీడియాలో కానీ, యూట్యూబ్‌ ఛానల్స్‌, వెబ్‌సైట్స్‌, పత్రికలు, టెలివిజన్‌ ఛానల్స్‌తో మాట్లాడొద్దని సూచించింది.

ఎదురుదెబ్బలు తిన్నా.. తలొగ్గని బీస్ట్‌.. నెల్సన్‌ దిలీప్‌ ప్రయాణమిదే!

‘సలార్‌: పార్ట్‌-సీజ్‌ఫైర్‌’పై ఇప్పటికే అనేక కథనాలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఇందులో నటించిన నటీనటులు సినిమా గురించి మాట్లాడితే, అవి మరింత వైరల్‌ అయ్యే అవకాశం ఉందని భావిస్తోంది. అదే సమయంలో అత్యుత్సాహంతో పొరపాటున ఎవరైనా స్టోరీ లీక్‌ చేసే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ‘సలార్‌1’లో శ్రుతిహాసన్‌ కథానాయిక. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబరు 28న సలార్‌ను విడుదల చేయనున్నట్లు హోంబాలే ఫిల్మ్స్‌ ఇప్పటికే ప్రకటించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని