Pareshan: ఓటీటీలోకి ‘పరేషాన్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇటీవల విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్న సినిమా ‘పరేషాన్‌’ (Pareshan). ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది.

Published : 20 Jul 2023 16:32 IST

హైదరాబాద్‌:  నటుడు రానా (Rana) సమర్పణలో వచ్చి ప్రేక్షకులను నవ్వించిన సినిమా ‘పరేషాన్‌’ (Pareshan). రూపక్ రొనాల్డ్‌సన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ గతనెలలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.  ప్రాంతీయ కథలకు ఆదరణ లభిస్తున్న ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అలరించడానికి సిద్ధమైంది. సోనీలీవ్‌ (SonyLiv) వేదికగా ప్రసారం కానునన్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆగస్టు 4వ తేదీ నుంచి ‘పరేషాన్‌’ డిజిటల్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుపుతూ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది.

ఈ వారం ఓటీటీలో అలరించనున్న సినిమాలు/సిరీస్‌లు.. ఇవే..!

కథేంటంటే: మంచిర్యాలలో సింగరేణి ఉద్యోగి సమర్పణ్ ( మురళీధర్ గౌడ్). బొగ్గుబావిలో పనిచేసుకుంటూ సమయం దొరికితే క్రైస్తవ ప్రార్థన సభల్లో అనువాదం చేస్తుంటాడు. అతని కొడుకు ఐజాక్ (తిరువీర్). స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతుంటాడు. బావి పనిలో పెట్టిస్తేనైనా తన కొడుకు బాగుపడతాడని తన ఉద్యోగం కొడుక్కి వచ్చేలా చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు సమర్పణ్. ఈ క్రమంలో కొడుకు ఉద్యోగం కోసం భార్య గాజులు, బంగారాన్ని అమ్మి డబ్బు జమచేస్తాడు. ఆ డబ్బును మధ్యవర్తికి ఇవ్వమని తల్లి ఐజాక్‌కు ఇస్తుంది. ఇంతలో తన స్నేహితుల్లో ఇద్దరికి ఆపద వస్తుంది. ఆ డబ్బును వాళ్లకిచ్చి ఆ ఆపద నుంచి గట్టెక్కిస్తాడు ఐజాక్‌. అప్పుడే ఊళ్లో జరిగిన ఓ పెళ్లి బారాత్ లో శిరీష(పావని)ని చూసి ఇష్టపడతాడు. (Pareshan movie in SonyLiv )శిరీష కూడా ఐజాక్ ను ప్రేమిస్తుంది. ఓ రోజు శారీరకంగా ఒక్కటవుతారు. వారం తిరగకుండానే శిరీషకు వాంతులవుతాయి. తాను గర్భం దాల్చినట్లు ఐజాక్‌కు చెప్పడంతో ఇద్దరూ పరేషాన్‌ అవుతారు. ఊళ్లో ఉన్న ఆస్పత్రులకు వెళ్తే అసలు విషయం బయటపడుతుందని భయపడతారు. హైదరాబాద్ వెళ్లి ఆస్పత్రిలో చూపిస్తానని స్నేహితుడి బండి అమ్మి డబ్బు తీసుకుంటాడు ఐజాక్. అదే రోజు రాత్రి ఐజాక్ జేబులోని డబ్బు, పక్కనే ఉన్న స్నేహితుడు సత్తి కనిపించకుండా పోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? డబ్బుతో పారిపోయిన సత్తి దొరికాడా?శిరీష, ఐజాక్‌ల పరిస్థితి ఏమైంది? అనేది సోనీలీవ్‌లో ప్రసారం కానున్న ‘పరేషాన్‌’లో చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని