Parineeti Chopra: వాళ్ల పార్టీలకు వెళ్లకపోవడం వల్లే మంచి అవకాశాలు రాలేదు: పరిణీతి చోప్రా

తన పీఆర్‌ కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయినట్లు నటి పరిణీతి చోప్రా చెప్పారు.

Published : 20 Apr 2024 17:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా రోజుల తర్వాత ‘అమర్‌సింగ్‌ చంకీల’తో విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా. ఈ చిత్రం హిట్‌పై ఎంతో ఆనందంగా ఉందంటూ ఓ ఆంగ్లమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. అలాగే తన వ్యక్తిగత సిబ్బంది కారణంగా మంచి అవకాశాలు కోల్పోయినట్లు చెప్పారు.

‘‘ప్రస్తుతం నాకున్న గుర్తింపు కంటే ఇంకా మంచి స్థానంలో ఉండాల్సిన దానిని. నేను ఎలాంటి పాత్రనైనా చేయగలను. కానీ, నా పీఆర్‌ కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయాను. ప్రముఖులతో సంబంధాలను పెంచుకోలేకపోయాను. వాళ్ల ఫోన్‌లకు సమాధానం చెప్పలేకపోయా. పార్టీలకు, ఫంక్షన్లకు హాజరుకాలేదు. ప్రముఖుల ఇళ్లల్లో పార్టీలకు వెళ్లకపోవడం వల్ల అవకాశాలు రాలేదు. కొన్నిసార్లు అలాంటి సమావేశాల వల్ల కూడా మంచి ప్రాజెక్ట్‌ల సంగతి తెలుస్తుంది. ప్రతీ అవకాశం అలానే వస్తుందని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ, పార్టీల వల్ల కూడా మంచి సినిమాల్లో నటించే ఛాన్స్‌లు వస్తాయి. అందుకే మన టీమ్‌ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలి. అలా లేనందువల్లే నేను చాలా అవకాశాలు కోల్పోయాను. కాబట్టి.. ప్రతిభావంతులైన నటీనటులకు నేను ప్రతినిధిగా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ల టాలెంట్‌కు తగిన అవకాశాలను ఇవ్వమని దర్శక నిర్మాతలను అడుగుతాను’’ అని చెప్పారు.

27 ఏళ్ల వయసులోనే హత్యకు గురైన ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్‌సింగ్ చంకీల జీవితం ఆధారంగా ‘అమర్‌సింగ్‌ చంకీల’ని ఇంతియాజ్‌ అలీ తెరకెక్కించారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు అందించారు. దీనికోసం పరిణీతి దాదాపు 30 కిలోల బరువు తగ్గారు. ఇందులో ఆమె ఓ పాట కూడా ఆలపించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంపై ఇప్పటికే పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని