Parineeti Chopra: ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు: పరిణీతి చోప్రా

ప్రముఖ పంజాబీ గాయకుడు జీవితం ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘అమర్‌సింగ్ చంకీల’. ఈ చిత్రానికి వస్తోన్న స్పందనపై నటి పరిణీతి చోప్రా ఆనందం వ్యక్తం చేశారు.

Updated : 15 Apr 2024 12:08 IST

ముంబయి: 27 ఏళ్ల వయసులోనే ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్‌ సింగ్ చంకీల హత్యకు గురయ్యాడు. ఆయన జీవితం ఆధారంగా నిర్మించిన చిత్రానికి ఇంతియాజ్‌ అలీ దర్శకత్వం వహించారు. ఆ చిత్రమే ‘అమర్‌సింగ్‌ చంకీల’. పంజాబీ, బాలీవుడ్‌ నటుడు దిల్జిత్‌ దొసాంజ్‌, నటి పరిణీతి చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఏప్రిల్‌ 12న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన ఈ చిత్రం విశేష స్పందనలు సొంతం చేసుకుంది. దీనిలో తన పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌పై పరిణీతి చోప్రా తాజాగా స్పందించారు. సినీ ప్రియులు చూపిస్తోన్న ప్రేమాభిమానాలతో తన మనసు నిండిందన్నారు.

‘‘అమర్‌ సింగ్‌ చంకీల’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. ఆనందంతో కన్నీళ్లు ఆగడం లేదు. పరిణీతి ఈజ్‌ బ్యాక్‌.. అనే మాటలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. దీనిని నేనస్సలు ఊహించలేదు. అవును.. నేను తిరిగొచ్చేశా. ఎక్కడికీ వెళ్లను’’ అని ‘ఎక్స్‌’లో పోస్ట్ పెట్టారు.

ప్రియాంక చోప్రా బంధువుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి పరిణీతి చోప్రా. 2011లో విడుదలైన ‘లేడీస్ వర్సెస్‌ రికీ బహ్ల్’లో కీలక పాత్ర పోషించారు. ‘కిల్‌ దిల్‌’, ‘డిష్యూం’, ‘గోల్‌మాల్‌ అగైన్‌’, ‘కేసరి’, ‘సైనా’ వంటి చిత్రాల్లో ఆమె కథానాయికగా ప్రేక్షకులను అలరించారు. ఆప్‌ యువ నాయకుడు రాఘవ్‌ చద్ధాను గతేడాది ఆమె వివాహం చేసుకొన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి పలుకుతారని ప్రచారం జరిగింది. తాజా పోస్ట్‌తో ఆ ఊహాగానాలకు చెక్‌ పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని