Hanuman: ఆ సినిమా స్ఫూర్తి ‘హనుమాన్‌’లో కనిపించింది: పరుచూరి గోపాలకృష్ణ

‘హనుమాన్‌ ’ పై పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. సినిమా ఓ అద్భుతమని ప్రశంసించారు.

Published : 30 Mar 2024 14:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఈ ఏడాది సంక్రాంతి బరిలో విజేతగా నిలిచి అద్భుతమైన వసూళ్లు సాధించింది ‘హనుమాన్‌’ (HanuMan). ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని తెలిపారు. ‘పరుచూరి పలుకుల్లో’ భాగంగా దీన్ని విశ్లేషించారు. ఓపెనింగ్‌ సన్నివేశంలోని ట్విస్ట్‌ను చివర్లో చూపించారని.. దాన్ని ఎవరూ ఊహించలేదన్నారు.

‘‘హనుమాన్‌’ను చక్కగా తెరకెక్కించారు. ఆయన గొప్ప దైవభక్తుడు. అలాంటి ఆయన సాయంతోనే రాముడు.. సీతమ్మను లంక నుంచి విడిపించుకున్నాడు. ఈ సినిమా చూసేటప్పుడు పురాణాలన్నీ మన మనసులో మెదులుతూ ఉంటాయి. ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన ‘పాతాళభైరవి’ స్ఫూర్తి ఇందులో కొన్ని పాత్రల్లో కనిపించింది. ఆ సినిమా స్ఫూర్తితో రూపొందించిన హనుమంతుడి కథే ‘హనుమాన్’. చిన్న పిల్లాడు పెద్ద విలన్‌లను పడగొట్టినట్లు చూపించడం బాగుండదు కాబట్టి ఆ అబ్బాయికి దైవశక్తి తోడున్నట్లు చూపించారు.

‘పాతాళభైరవి’ సినిమాను ఎన్టీఆర్‌తో తీయడానికి అందరూ భయపడ్డారు. కానీ, ఇప్పుడు ‘హనుమాన్‌’ను తేజ సజ్జాతో తీసేందుకు ప్రశాంత్‌వర్మ భయపడలేదు. అతడి ధైర్యానికి హ్యాట్సాఫ్. తన స్క్రీన్‌ప్లేపై అంత నమ్మకం పెట్టుకున్నారు. ఓపెనింగ్‌లో హీరోను చిలిపి పనులు చేసే కుర్రాడిలా చూపించడం దర్శకుడి తెలివితేటలకు నిదర్శనం. ఒక సన్నివేశంలో హీరో తన చేతులతో కొండను ఎత్తుతాడు.. అప్పుడు గోవర్థన గిరి ఎత్తిన శ్రీకృష్ణుడిలా కనిపిస్తాడు. కొండంత బలమున్న ఈ సినిమా కథను కూడా తేజసజ్జా (Teja Sajja) తన భుజాలపై వేసుకున్నాడు. అతడిని ప్రశాంత్ వర్మ విజయంవైపు నడిపించారు. ఈ సినిమా క్రెడిట్స్ ఎక్కువ శాతం దర్శకుడికే వెళ్తాయి. పురాణాల్లోని పాత్రలన్నీ మన మనసుల్లో నిండిపోయాయి. వాటిని మనమంతా విశ్వసిస్తాం. ఆ విశ్వాసమే ప్రశాంత్‌ వర్మ ‘హనుమాన్‌’ తీయడానికి కారణమైంది. ఆయన్ని నమ్మిన నిర్మాతలను కూడా మెచ్చుకోవాలి.

సినిమా విజయం అందులోని సన్నివేశాలపై ఆధారపడి ఉంటుంది. ఏ సీన్‌ తర్వాత ఏది రావాలనేది తెలిసి ఉండాలి. లేదంటే కష్టం. ఇందులోని ఎన్నో సన్నివేశాలను దర్శకుడు తెలివిగా ముగించారు. అక్కాతమ్ముళ్ల అనుబంధం కూడా అద్భుతం. అక్క పాత్రకు ఇచ్చిన ముగింపు నేను ఊహించలేదు. దేవుడి కోసం ఈ కథను చూపిస్తున్నాడు అనుకునే సమయానికి పగ, ప్రతీకారాలను చూపించారు. అలా చూపించడం డైరెక్టర్‌ తెలివితేటలే. చిన్న హీరోతో పెద్ద కథను నడిపిస్తున్నా అని ఆయన అనుక్షణం గుర్తుపెట్టుకున్నారు. చివరి అరగంట ఉత్కంఠభరితంగా ఉంది. ఈ సినిమా ఇప్పటికే వందల కోట్లు వసూళ్లు చేసింది. దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్‌హాఫ్‌లో కొంత నిడివి తగ్గించి ఉంటే బాగుండేదని అనిపించింది. యూత్‌ కోసం రొమాంటిక్‌ సన్నివేశాలు ఇంకొన్ని ఉంటే బాగుండేది. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతమైన సినిమా తీసి నేటి తరాన్ని ఆకర్షించారు’’ అని దర్శకనిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చిన్న సినిమాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కూడా పరుచూరి  (Paruchuri Gopala Krishna) ధన్యవాదాలు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని