
HBD Pawan kalyan: ‘పవన్‌కల్యాణ్’ ఆ పేరే యువతకు మంత్రం!
‘నువ్వు నందా అయితే, నేను బద్రి బద్రినాథ్ నాథ్’ ఆ ఆవేశానికి ప్రేక్షకలోకం ఫిదా అయింది. ‘నాకో తిక్కుంది, దానికో లెక్కుంది’ గబ్బర్ సింగ్‌లో ఆయన చెప్పిన డైలాగ్‌కి కుర్రకారు కేరింతలు కొట్టింది. ఇలాంటి డైలాగ్స్‌తోనే కాదు, పాటలు, ఫైట్లతో అభిమానులను చొక్కా ఎగరేసుకునేలా చేసిన హీరో పవన్ కల్యాణ్. ఆయన తొడిగిందే ఫ్యాషన్ అయిన రోజులున్నాయి. ఆయన మాటే శాసనంగా మారిన సందర్భాలూ ఉన్నాయి. తెలుగు యువతను ఈ స్థాయిలో ప్రభావితం చేసిన హీరో మరొకరు లేరంటారు పరిశ్రమ పెద్దలు. పవన్‌లో యువతకు అంతగా నచ్చిన అంశాలేంటి? తెలుగు యువతను ఆయనెలా ప్రభావితం చేశాడో చూద్దాం!
యువతను తనవైపు తిప్పుకొనే శక్తి
పవన్ కల్యాణ్ బలమే యువత. మొదటి నుంచి పాటలైనా, స్టంట్స్ అయినా, స్టైల్ అయినా పవన్ ఏది చేస్తే అది అనుసరించే అభిమానులు పెరిగిపోయారు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాలో కారు టైర్ల కింద చేతులు పెట్టి చేసిన స్టంట్‌ను నిజంగానే చేసి చూపించారు పవన్. ఇలాంటి సాహసాలు అభిమానులకు మరింత దగ్గర చేశాయి. ‘ఖుషి’, ‘తమ్ముడు’, ‘బద్రి’ సినిమాల్లోని స్టైల్ యూత్‌కి నిద్ర లేకుండా చేసింది. ఆయన ఏది తొడిగితే అదే ఫ్యాషన్ అనేంతగా ఊగిపోయింది యువత. ‘బాలు’, ‘గబ్బర్‌సింగ్’, ‘గుడుంబా శంకర్’, ‘బంగారం’ సినిమాల్లో ఫ్యాషన్ మాత్రం సూపర్ హిట్టయింది!
పవన్ పాడితే లోకమే ఊగదా!
‘అత్తారింటికి దారేదీ’ చిత్రంలో పవన్‌పాడిన ‘కాటమ రాయుడా’ పాట ఎంతగా హిట్టైందో తెలిసిందే. థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించిన పాటది. ఆయన పాడితే అభిమానులే కాదు, థియేటర్‌కొచ్చిన సాధారణ ప్రేక్షకులు కూడా గంతులేస్తారు. అంతటి పవర్ ఉంది ఆయన గాత్రానికి. అలాంటిదే ‘అజ్ఞాతవాసి’లోనూ ’కొడకా కోటేశ్వర్రావు’ పాడారు. ఇవే కాదు ఆయన సరదా సన్నివేశాల్లో పాడే జానపదాలు కూడా విపరీతంగా ఆకట్టుకుంటాయి. ‘తమ్ముడు’ చిత్రం లోని ‘ఏం పిల్లా మాటాడవా’,‘తాటి చెట్టెక్కలేవు’లాంటి జానపదాలు ఇప్పటికీ అంతే ఊపునిస్తాయి. ‘జానీ’లోని ‘నువ్వు సారా తాగుడు మానురన్నో’, ఖుషిలోని ‘బైబైయ్యే బంగారు రమణమ్మ’ లాంటి పాటలు కూడా ప్రత్యేకంగా నిలిచాయి. ఇలా గాయకుడిగానూ ఫ్యాన్స్‌కి పూనకాలు తెచ్చిన హీరో పవన్.
పవర్ నిండిన పోరాటాలు
మిగతా సినిమాలకు విభిన్నంగా పోరాట సన్నివేశాలుండేలా చూసుకుంటారు పవన్ కల్యాణ్. ఆయనే స్వయంగా కొన్ని సినిమాల్లో ఫైట్స్‌ని రూపొందించారు. ప్రతి సినిమాలో మార్షల్ ఆర్ట్స్ ఉండేలా చూసుకోవడం మరో ప్రత్యేకత. పదునైన చూపుతో, చిరుత వేగంతో చేసే ఆ ఫైట్స్ అభిమానులకు అంతులేని ఆనందాన్నిస్తాయి. ‘బద్రి’, ‘ఖుషి’, ‘తమ్ముడు’, ‘పంజా’లాంటి సినిమాలే ఇందుకు ఉదాహరణ. ఇక ‘జానీ’ సినిమాలో ఆయన రూపొందించిన ఫైట్స్ టాలీవుడ్‌లోనే ప్రత్యేకంగా నిలిచాయి. పోరాట సన్నివేశాలు సినిమాటిక్‌గా కాకుండా సహజసిద్ధంగా ఉండటమే యువతను విపరీతంగా ఆకట్టుకుంది. క్రిష్‌తో చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ కోసం కర్రసాములో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ‘భీమ్లా నాయక్’ లోనూ తనదైన శైలీ పోరాటాలుంటాయని వినికిడి.
గన్స్ అండ్ మోర్ గన్స్
పవన్ కల్యాణ్‌ను ఒప్పించాలంటే సినిమాలో తుపాకులతో పోరాటాలు ఉంటే చాలని పూరి జగన్నాథ్ ఓ ఆడియో వేడుకలో చెప్పారు. ఏ సినిమా తీసుకున్నా తుపాకుల మోతతో ఓ సన్నివేశం ఉండాల్సిందే. పవన్ కనిపించే తీరు, తుపాకీతో చేసే పోరాట ఘట్టాలు అభిమానులు చొక్కాలు చించుకునేలా ఉంటాయి. ఇక గబ్బర్‌సింగ్‌లో తుపాకీతో చేసిన హంగమా అందరికీ తెలిసిందే. భీమ్లా నాయక్‌లోనూ ఇవే ఆసక్తికరంగా మారనున్నాయి. పవన్‌ని ఆరడుగుల బుల్లెట్టు అని ఊరికే అనలేదు మరి.
కనిపిస్తే చాలు కాసుల వర్షం
‘పవన్ కల్యాణ్‌కి ప్రత్యేకంగా కథ అక్కర్లేదు. ఆయన తెర మీద కనిపిస్తే చాలు కాసుల వర్షం కురుస్తుంది’ ఈ మాట అన్నది ఎవరో కాదు, ‘బాహుబలి’ చిత్ర రచయిత విజేయేంద్రప్రసాద్. ఇలాంటి అభిప్రాయాలు చాలా మంది దర్శకులు వ్యక్తం చేశారు. పవన్‌కి ఉన్న క్రేజ్, ఆయనకున్న అభిమానగణం అలాంటిది మరి. ఆయనలా నిలబడి ఓ చూపు చూసినా, ఓ డైలాగ్ చెప్పినా చాలు బాక్సాఫీస్‌పై వసూళ్ల యుద్ధం జరుగుతుందని సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తారు. పుస్తకం పట్టుకున్నా, తుపాకీని తిప్పినా, చివరికి గులాబీని ముట్టుకున్నా పవర్‌ఫుల్‌గా ఉంటుందని అభిమానులు గర్వంగా చెప్పుకొనే మాట.
‘గబ్బర్‌సింగ్’ని ఆయనే సొంతంగా నిర్మించాలని ‘దబాంగ్’ హక్కులు తీసుకున్నారు. కానీ బండ్ల గణేశ్‌కి అవకాశమిచ్చారు. అది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలా ఫ్లాప్‌లున్న వారికి హిట్లిచ్చి తన పెద్ద మనసు చాటుకున్నారాయన. చిన్న సినిమాలు తీసిన సాగర్ కె.చంద్రకు ‘భీమ్లా నాయక్’ అవకాశం ఇవ్వడం కూడా సాహసమే. ఇలాంటివి ఆయన కెరీర్‌లో ఎన్నో ఉన్నాయి. త్వరలోనే మరో ఇద్దరు యువ దర్శకులకు సైతం అవకాశం ఇవ్వనున్నారటే టాక్ వినిపిస్తోంది. ఎప్పుడూ ఇలాగే అందరినీ అలరిస్తూ, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ...