Prabhas: ఆ ఇద్దరితో కలిసి నటించడం గర్వంగా ఉంది: ప్రభాస్‌

ప్రభాస్‌ హీరోగా నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు.

Updated : 23 May 2024 02:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కోలీవుడ్‌ నటుడు కమల్‌ హాసన్‌లతో (Kamal Haasan) కలిసి నటించడం గర్వంగా ఉందన్నారు టాలీవుడ్‌ హీరో ప్రభాస్ (Prabhas). ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు.  ఈ ముగ్గురూ కలిసి నటించిన చిత్రమిది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. జూన్‌ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రత్యేక ఈవెంట్‌ నిర్వహించింది. సినిమాలో కీలకమైన ‘బుజ్జి’ (Bujji) అనే వాహనాన్ని అభిమానులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలా దేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

వేడుకనుద్దేశించి ప్రభాస్‌ మాట్లాడుతూ.. ‘‘భద్రతను దృష్టిలో పెట్టుకుని తక్కువ మందితో ఈవెంట్‌ నిర్వహించాం. ఎక్కువ మంది అభిమానులను ఆహ్వానించలేనందుకు క్షమించండి. అమితాబ్‌ బచ్చన్, కమల్‌ హాసన్‌లను చూసి చిత్ర పరిశ్రమ స్ఫూర్తి పొందింది. అలాంటి ఈ ఇద్దరితో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. ఆ అవకాశం ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌, అశ్వనీదత్‌లకు థ్యాంక్స్‌. ఎవరైనా అమితాబ్‌ బచ్చన్‌ ఫ్యాన్‌ అవ్వాల్సిందే. అందరం ఆయన్ను స్ఫూర్తిగా తీసుకునే ఇండస్ట్రీలోకి వచ్చాం. ‘సాగర సంగమం’లో కమల్‌ సర్‌ వేసుకున్న దుస్తులు నచ్చి, నాకూ అలాంటివి కొనివ్వమని మా అమ్మని అడిగేవాణ్ని. ఆయన నటనకు 100 దండాలు. దీపికా పదుకొణె.. ఓ సూపర్‌స్టార్‌. దిశా పటానీ.. హాట్‌స్టార్‌. నిర్మాత అశ్వనీదత్‌ సర్‌కు డబ్బు భయం లేదు. ఈ వయసులోనూ సినిమాపై ఆయనకు ప్రేమ తగ్గలేదు. చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లుగా ప్రొడ్యూసర్‌గా ఉన్నది ఆయనొక్కరే. అశ్వనీదత్‌ తరహాలోనే ఆయన ఇద్దరు కుమార్తెలు శ్రమిస్తున్నారు’’ అని అన్నారు. 'జీవితంలోకి ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు అని మీరు పెట్టిన పోస్టు చూసి అమ్మాయిల హృదయాలు ముక్కలయ్యాయి’ అని హోస్ట్ అంటుంటే.. వాళ్ల కోసమే పెళ్లి చేసుకోలేదు అని పెళ్లిపై సరదాగా కామెంట్ చేశారు.

దర్శకుడిని ఉద్దేశిస్తూ ‘‘సినిమాని మూడేళ్లపాటు తీసి, వీడియోను 50 సెకన్లు చూపిస్తారా? మిమ్మల్ని కొట్టాలి సర్’’ అంటూ ప్రభాస్‌ నవ్వులు పంచారు. ‘ఇది విడుదలకు ముందు వరకు చిన్న సినిమా. విడుదలయ్యాక పెద్ద సినిమా అంటూ అశ్వనీ దత్ అంచనాలు పెంచారు. టెక్నాలజీ తో కూడిన ఇలాంటి సినిమాలను తీయడం కొంచెం కష్టమని, తాను అడగ్గా ఆనంద్ మహీంద్రా టెక్నికల్‌గా సపోర్ట్ ఇచ్చారని చెప్పారు. ఆయనకు, టీమ్‌కు థాంక్స్ చెప్పారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని