Adipurush: ప్రభాస్‌కు అప్పుడే అనుమానం వచ్చింది.. డోంట్‌వర్రీ అన్న ఓంరౌత్‌!

Adipurush: ప్రభాస్‌ కీలక పాత్రలో ఓం రౌత్‌ తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Published : 21 Jun 2023 01:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) చుట్టూ వివాదాలు ముసురుకున్న సంగతి తెలిసిందే. రామాయణాన్ని వక్రీకరించారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, మరోవైపు కలెక్షన్ల పరంగా ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రాణిస్తూనే ఉంది. ఇప్పటికే రూ.375 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం చెబుతోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. ‘ఆదిపురుష్‌’ షూటింగ్‌ నాలుగు రోజులు పూర్తయిన తర్వాత తాను పోషిస్తున్న రాఘవుడి పాత్రపై అనుమానం వ్యక్తం చేసినట్లు ప్రభాస్‌ ఆ వీడియోలో పేర్కొన్నారు. ‘రాధేశ్యామ్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన ఆ వీడియోను ప్రభాస్‌ అభిమానులు ఇప్పుడు షేర్‌ చేస్తూ, ఓం రౌత్‌ మేకింగ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

‘రాధేశ్యామ్‌’ ప్రచారంలో భాగంగా అప్పట్లో ప్రభాస్‌ మాట్లాడుతూ.. ‘‘నాలుగు రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఓం రౌత్ (Om Raut)ని పిలిచి ‘నేను ఈ సినిమా చేయొచ్చా?’ అని అడిగా. ఎందుకంటే అంతకుముందు అలాంటి  సినిమా/పాత్ర నేను చేయలేదు. ఇతర సినిమాల విషయంలో తప్పు జరిగినా పర్వాలేదు, ‘ఆదిపురుష్‌’ విషయంలో తప్పు చేయకూడదు. అందుకే ఓంరౌత్‌ను పిలిచి మరీ ‘నేను ఈ సినిమా చేయొచ్చా’ అని అడిగా. ‘ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. నేనున్నా’ అని ఓంరౌత్‌ అన్నాడు’’ అని ప్రభాస్‌ చెప్పిన విషయం ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది. దీంతో ప్రభాస్‌ అభిమానులు ఓంరౌత్‌పై విరుచుకుపడుతున్నారు. రామాయణంలాంటి గొప్ప కావ్యాన్ని సినిమా తీయాలనుకున్నప్పుడు ఏ కసరత్తులు చేయకుండా ఇష్టం వచ్చినట్లు తీయడం సరికాదని విమర్శిస్తున్నారు. తమ హీరో ముందే హెచ్చరించినా, సరి చూసుకోకుండా ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ‘ఆదిపురుష్‌’ తీశాడని అంటున్నారు.

మరోవైపు దర్శకుడు ఓం రౌత్‌ తాను తీసిన ‘ఆదిపురుష్‌’ను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రిపబ్లిక్‌ వరల్డ్‌తో మాట్లాడుతూ.. ‘‘రామాయణం అనేది ఎంతో విస్తృతమైంది. ఉన్నది ఉన్నట్లు తీయడం ఎవరికీ సాధ్యం కాదు. ఇక్కడ రెండు విషయాలు గుర్తించాలి. ‘రామాయణం మాకు అర్థమైంది’ అని ఎవరైనా అంటే వాళ్లు అబద్ధం చెబుతున్నారని అర్థం. చిన్నప్పటి నుంచి మనం టెలివిజన్‌లో చూసిన రామాయణం చాలా పెద్దది. ఇక ‘ఆదిపురుష్‌’ విషయానికొస్తే, దీన్ని పూర్తి రామాయణం అని అనలేం. ఇది రామాయణంలోని ఒక భాగం మాత్రమే. అందుకే  ‘ఆదిపురుష్‌’ అని పేరు పెట్టాం. మేము కేవలం యుద్ధకాండను మాత్రమే చూపించాలనుకున్నాం. అది కూడా యుద్ధకాండలో మేము చూపించింది కూడా చాలా చిన్న భాగం’’ అని ఓం రౌత్‌ (om raut) చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు