Prithviraj Sukumaran: సలార్‌.. కథ విన్న వెంటనే ప్రభాస్‌కు ఫోన్‌ చేశా: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

‘సలార్‌’ (Salaar)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు ప్రభాస్‌ (Prabhas), పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran). డిసెంబర్‌ 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పృథ్వీరాజ్‌ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.

Updated : 18 Dec 2023 17:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) మంచి మనసు ఉన్న వ్యక్తి అని మలయాళీ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రశంసించారు. సెట్‌లో ఉన్న వారందరినీ ఆయన ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సలార్‌’ కథ విన్న వెంటనే తాను మొదట ప్రభాస్‌కే ఫోన్‌ చేశానని చెప్పారు.

‘‘భారీ సెట్స్‌.. యాక్షన్స్‌.. మాత్రమే కాదు. అద్భుతమైన పాత్రలు, ఇంటెన్స్‌ డ్రామా కూడా ఈ చిత్రంలో ఉంది. అందుకే, ఇదొక ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ లాంటి చిత్రమని తరచూ ప్రభాస్‌కు చెబుతుండేవాడిని. ‘సలార్‌’ కథ విన్న వెంటనే ప్రభాస్‌కే మొదట ఫోన్‌ చేశా. ఒక ఫిల్మ్‌మేకర్‌గా ఎంతో కాలం నుంచి అతడిని ఇలాంటి చిత్రంలో చూడాలనుకుంటున్నానని చెప్పా. ప్రభాస్‌ చాలా సింపుల్‌ పర్సన్‌. తనకు ఎంతటి స్టార్‌డమ్‌ ఉందో అతడికి తెలియదు. సెట్‌లో తోటి నటీనటులు ఎవరైనా నిల్చొని ఉంటే వాళ్లకు కుర్చీలు ఏర్పాటు చేసేవరకూ ప్రభాస్‌ కూడా నిల్చొనేవాడు. నేను వేరే చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిననే భావన నాకు ఏరోజు రాలేదు. అంతలా ప్రభాస్‌ జాగ్రత్తలు తీసుకున్నాడు’’ అని పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెలిపారు.

Vyooham: రివ్యూ: వ్యూహం.. అన్నపూర్ణ స్టూడియోస్‌ వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

అనంతరం, ఆయన ప్రభాస్‌కు ఇష్టమైన చిత్రాల గురించి మాట్లాడారు. ‘‘సలార్‌’ షూట్‌లో భాగంగా ప్రభాస్‌తో చాలా విషయాలు షేర్‌ చేసుకున్నా. ఆయనకు ఇష్టమైన చిత్రాల గురించి అడిగి తెలుసుకున్నా. ‘బాహుబలి’ తర్వాత ప్రతి ఒక్కరూ తనతో భారీ బడ్జెట్‌ ప్రాజెక్ట్‌లు చేస్తున్నారని.. తనకు మాత్రం విభిన్నమైన చిత్రాలు చేయాలని ఉందని.. లవ్‌స్టోరీలు, కామెడీ ఫిల్మ్స్‌ చేయాలని ఆశగా ఉందని అతడు చెప్పాడు’’ అని పృథ్వీరాజ్‌ అన్నారు.

‘సలార్‌’ చిత్రానికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగాన్ని ‘సలార్‌ పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌’ పేరుతో విడుదల చేయనున్నారు. డిసెంబర్‌ 22న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవగా ప్రభాస్‌.. వరదరాజ అనే పాత్రలో పృథ్వీరాజ్‌ కనిపించనున్నారు. శ్రుతి హాసన్‌ కథానాయిక. జగపతిబాబు, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై ఇది నిర్మితమవుతోంది.

భారీ కటౌట్‌:

‘సలార్‌’ సందడి దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. రిలీజ్‌ను పురస్కరించుకుని ఆయా ప్రాంతాల్లో అభిమానులు భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. ముంబయిలో ఏకంగా 120 అడుగుల ప్రభాస్‌ కటౌట్‌ను తాజాగా ఏర్పాటు చేశారు. ఆర్‌ మాల్‌ వద్ద ఏర్పాటు చేసిన ఈ కటౌట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని