Vyooham: రివ్యూ: వ్యూహం.. అన్నపూర్ణ స్టూడియోస్‌ వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌పై నిర్మితమైన వెబ్‌సిరీస్‌ ‘వ్యూహం’. ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ సిరీస్‌ ఎలా ఉందంటే?

Published : 18 Dec 2023 11:43 IST

వెబ్‌సిరీస్‌: వ్యూహం; నటీనటులు: సాయి సుశాంత్‌ రెడ్డి, చైతన్య కృష్ణ, పావని గంగిరెడ్డి, శశాంక్‌, ప్రీతి అస్రానీ, శ్వేతా వర్మ, రవీంద్ర విజయ్‌ తదితరులు; సంగీతం: శ్రీరామ్‌ మద్దూరి; ఛాయాగ్రహణం: కె. సిద్ధార్థ రెడ్డి; కూర్పు: సాయి మురళి; నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్‌; నిర్మాత: సుప్రియ యార్లగడ్డ; కథ, దర్శకత్వం: శశికాంత్‌ శ్రీవైష్ణవ్‌ పీసపాటి; స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో.

ఒకే పేరుతో రెండు ప్రాజెక్టులు రూపొంది, కొన్ని రోజుల వ్యవధిలోనే అవి విడుదలైతే ప్రేక్షకుల్లో సందిగ్ధం నెలకొంటుంది. ‘వ్యూహం’ (Vyooham) విషయంలోనూ ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. ఈ పేరుతో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఓ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ నెల 29న అది విడుదల కానుంది. ఈలోగా.. అదే టైటిల్‌తో రూపొందిన వెబ్‌సిరీస్‌ (Vyooham Web series) ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో (Vyooham on Amazon Prime Video) విడుదలైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన సిరీస్‌ ఇది. మరి, ఈ ‘వ్యూహం’ కథేంటి? ఎలా ఉందంటే? (Vyooham Web series Review)

కథేంటంటే: మైఖేల్‌ (చైతన్య కృష్ణ) (Chaitanya Krishna).. తన భార్య జెస్సికా (పావని గంగిరెడ్డి)ను హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేయగా అది క్యాన్సిల్‌ అవుతుంది. ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో జెస్సికాను బైక్‌పైనే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు మైఖేల్‌ . ప్రయాణంలో కొన్ని ద్విచక్ర వాహనాలు వారికి అడ్డురాగా త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. కానీ, ఓ కారు ఢీ కొడుతుంది. దాంతో, జెస్సికాకు గర్భస్రావం అవుతుంది. గతాన్నీ మర్చిపోతుంది. ప్రమాదం గురించి పోలీసులకు వివరించి, మైఖేల్‌ కేసు పెడతాడు. ఆ కేసు ఏసీపీ అర్జున్‌ రామచంద్ర (సాయి సుశాంత్‌ రెడ్డి) (Sai Sushanth) వద్దకు వెళ్తుంది. రంగంలోకి దిగిన ఏసీపీ అర్జున్‌.. మైఖేల్‌ వాళ్లకు అడ్డొచ్చిన ద్విచక్రవాహన దారులు, యాక్సిడెంట్‌ చేసిన కారు డ్రైవర్‌కు ఏదో సంబంధం ఉందని అనుమానిస్తాడు. అది ‘హిట్‌ అండ్‌ రన్‌’ కేసు కాదని, దాని వెనుక పెద్ద నెట్‌వర్క్‌ ఉందని భావిస్తాడు. మరోవైపు, జర్నలిస్ట్‌ నిర్మల మృతి చెందడం కలకలం రేపుతుంది. వ్యాపారం పేరుతో దందా చేసే రెడ్డెన్న కుమార్తె నిహారిక (ప్రీతి అస్రానీ) కిడ్నాప్‌నకు గురవుతుంది. మరి, వీటన్నింటికీ కారకులెవరని తెలుసుకునే ప్రయత్నంలో ఏసీపీ ఎదుర్కొన్న సవాళ్లేంటి? మైఖేల్‌ ఏం పనిచేస్తుంటాడు? అతడికి, రెడ్డెన్నకు మధ్య లింకేంటి? తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే (Vyooham Web series Review).

ఎలా ఉందంటే: తెలిసో, తెలియకో ఇతరులకు హాని చేస్తే ఎప్పటికైనా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సిందేనన్న కాన్సెప్ట్‌తో రూపొందిందీ సిరీస్‌. రోడ్డు ప్రమాదంతో దాన్ని వివరించిన తీరు మెప్పిస్తుంది. మొత్తం 8 ఎపిసోడ్లు (ఒక్కో ఎపిసోడ్‌ నిడివి దాదాపు 40 నిమిషాలు). మైఖేల్‌ దంపతుల ప్రయాణం, మధ్యలో చోటుచేసుకునే పరిణామాలు, కారు ఢీ కొట్టడం, జెస్సికాకు గాయాలవడం, మైఖేల్‌ కేసు పెట్టడం, ఏసీపీ అర్జున్‌ రంగంలోకి దిగడం తదితర సన్నివేశాలతో సిరీస్‌ ఆసక్తిగా ప్రారంభమవుతుంది. అయితే ముందుకెళ్లేకొద్దీ గందరగోళంగా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా కథ ఒక చోట నుంచి మరో చోటుకి షిఫ్ట్‌ అవడం, కొత్త కొత్త పాత్రలు ఎంట్రీ ఇవ్వడంతో.. ఎప్పుడు? ఎక్కడ? ఏం జరుగుతుంది? అన్న సందేహాలు ప్రేక్షకుడికి కలుగుతాయి. కథ తొలి నాలుగు ఎపిసోడ్లలో నెమ్మదిగా సాగుతుంది. ఐదో ఎపిసోడ్‌ నుంచి వేగం పుంజుకుంటుంది. యాక్సిడెంట్‌ కేసును లోతుగా పరిశీలించే క్రమంలో ఏసీపీ అర్జున్‌కు టెర్రరిజం, నక్సలిజం, రౌడీయిజం సవాలుగా మారతాయి. ఒక్కో చిక్కుముడిని విప్పుతూ.. ఒకే ఘటనకు అవన్నీ మూలం అని వివరించే క్రమం మంచి అనుభూతి పంచుతుంది. అయితే, ప్రతిదాన్నీ క్షుణ్ణంగా చూపించడంతో సాగదీసినట్లు అనిపిస్తుంది. 

మరోవైపు, ప్రధాన పాత్రల ఫ్లాష్‌బ్యాక్‌ స్టోరీలు అలాగే అనిపిస్తాయి. ఐఏఎస్‌తో ఏసీపీ అర్జున్‌ పెళ్లి వ్యవహారం ట్రాక్‌ కూడా అనవసరం అన్న భావన కలుగుతుంది. జర్నలిస్ట్‌ నిర్మల హత్య, ఏసీపీ అర్జున్‌ తల్లి వాణీ రామచంద్ర హత్య, రెడ్డెన్న కుమార్తె నిహారిక కిడ్నాప్‌, మైఖేల్‌ బైక్‌ యాక్సిడెంట్‌.. వీటన్నింటినీ ఇంటర్‌లింక్‌ చేసిన విధానం, దాన్ని చూపించిన తీరుకు థ్రిల్‌ అవ్వాల్సిందే. నిహారిక కిడ్నాప్‌ ఎపిసోడ్‌లో వచ్చే రామ్‌జీ పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. క్యాబ్‌ డ్రైవర్‌ రాములు రోల్‌ కూడా ఈ సిరీస్‌లో కీలకం. ఈ రాములు, మైఖేల్‌ పాత్రలను లింక్‌ చేయడం, ఎక్కడైతే సిరీస్‌ని ప్రారంభించారో అదే చోట ఎండ్‌ చేయడం కొత్త అనుభూతి పంచుతుంది (Vyooham Web series Review). కీలకమైన పలు పాత్రలకు సరైన ముగింపు ఇవ్వలేదు. ఇలాంటి వాటికి సీజన్‌ 2లో సమాధానమిస్తారేమో చూడాలి.

ఎవరెలా చేశారంటే: ఏసీపీ అర్జున్‌ రామచంద్ర పాత్రకు స్కోప్‌ ఎక్కువగా ఉంది. సీరియస్‌గా సాగే ఆ క్యారెక్టర్‌లో సాయి సుశాంత్‌ ఆకట్టుకుంటారు. మైఖేల్‌గా కృష్ణ చైతన్య ఓకే అనిపిస్తారు. పావని, ప్రీతి అస్రానీ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు (Vyooham Web series Review).

సాంకేతికంగా ఎలా ఉందంటే: శ్రీరామ్‌ మద్దూరి నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలాన్నిచ్చింది. విజువల్స్‌ ఓకే. సాయి మురళి ఇంకా ట్రిమ్‌ చేసి ఉంటే సిరీస్‌ క్రిస్పీగా ఉండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. శశికాంత్‌ ఎంపిక చేసుకున్న పాయింట్‌ కొత్తగా ఉంది. టేకింగ్‌ కూడా బాగుంది (Vyooham Web series Review).

కుటుంబంతో కలిసి చూడొచ్చా: ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సిరీస్‌ ఇది. అసభ్య పదజాలం, రక్తపాతం, అశ్లీల సన్నివేశాలు ఇందులో లేవు.

  • బలాలు
  • + కాన్సెప్ట్‌
  • + చివరి నాలుగు ఎపిసోడ్లలోని మలుపులు
  • బలహీనతలు
  • - సాగదీత
  • - ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్లు
  • - అవసరానికి మించిన పాత్రలు
  • చివరిగా: థ్రిల్‌ పంచే వ్యూహమిది (Vyooham Web series Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని