Prasanth Varma: మీరు వింటున్న రూమర్స్‌ నిజమే.. సినిమాటిక్‌ యూనివర్స్‌పై ప్రశాంత్‌ వర్మ

తన సినిమాటిక్‌ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

Updated : 23 Apr 2024 21:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌’ (Prasanth Varma Cinematic Universe)పై వస్తున్న రూమర్స్‌ అన్నీ నిజమేనని దర్శకుడు ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) స్పష్టంచేశారు. తేజ సజ్జ (Teja Sajja) హీరోగా ఆయన తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్‌’ (HanuMan). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా పలు థియేటర్లలో విజయవంతంగా 100 రోజులు ప్రదర్శితమైంది. ఈసందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుకను (HanuMan Movie Historic 100 Days Celebrations) నిర్వహించింది. దర్శక, నిర్మాతలు టీమ్‌కు జ్ఞాపికలు అందజేశారు.

వేడుకనుద్దేశించి ప్రశాంత్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రతీ ఏడాది హనుమాన్‌ జయంతికి నేనో సినిమా అప్‌డేట్‌ ఇవ్వాల్సివస్తోంది. అది పెద్ద బాధ్యతగా భావిస్తున్నా. ‘హనుమాన్‌’ 50 రోజుల విజయోత్సవ వేడుకలో ‘మనం 100 రోజుల ఫంక్షన్‌ కూడా చేయగలుగుతాం’ అని నిర్మాత నిరంజన్‌ అంటే నేను నమ్మలేదు. కానీ, మీరంతా (ప్రేక్షకులు) దాన్ని నిజం చేశారు. 100 డేస్‌ ఫంక్షన్‌లు జరిగి చాలా రోజులైంది. చిరంజీవి ‘ఇంద్ర’ ఈవెంట్‌ నాకు బాగా గుర్తుంది. అందులో ‘నేనున్నా నాయనమ్మా’ (సినిమాలోని డైలాగ్‌) అని  బాలనటుడిగా చెప్పిన తేజతో హీరోగా నేనీ సినిమాలో చెప్పిస్తానని ఊహించలేదు. బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’, వెంకటేశ్‌ ‘నువ్వు నాకు నచ్చావ్‌’, పవన్‌ కల్యాణ్‌ ‘ఖుషి’, మహేశ్‌బాబు ‘పోకిరి’ ఈవెంట్లూ మంచి అనుభూతిని పంచాయి. అలాంటిది ఇప్పుడు వీకెండ్‌ కలెక్షన్లకు సినిమా పరిమితమైందని ఈతరం దర్శకులంతా ఫీలవుతున్నాం. ఓటీటీ వినియోగం పెరిగాక కూడా మా సినిమా థియేటర్లలో 100 రోజులు ఆడినందుకు అదృష్టంగా భావిస్తున్నా. సినిమా విడుదలైన తొలిరోజు నుంచి ఇప్పటివరకూ దర్శకుడిగా నాకు ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. అందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

‘జై హనుమాన్‌’.. ఆంజనేయుడిగా స్టార్‌ హీరో

PVCU (ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌)పై స్పందిస్తూ.. ‘‘ఇది నా ఎన్నోయేళ్ల కల. 20 సంవత్సరాలు నేను ఈ యూనివర్స్‌తో ప్రయాణించబోతున్నా. ‘హనుమాన్‌’లో చూసిన క్యారెక్టర్‌ రాబోయే చిత్రాల్లో కనిపిస్తాయి. విభీషణుడిగా సముద్రఖని, హనుమంతుగా తేజ కొనసాగుతారు. ఈ యూనివర్స్‌లో చాలామంది కొత్తవారిని పరిచయం చేయనున్నాం. టాలీవుడ్, బాలీవుడ్‌, కోలీవుడ్‌.. ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్‌ నటులను ఎంపిక చేస్తాం.      నా సినిమా నచ్చి వారే యూనివర్స్‌లో భాగమవ్వాలనుంది అని అడిగారు. ఆమేరకు ఇప్పటికే సిద్ధమైన స్ర్కిప్టుల్లో కొన్ని మార్పులు చేస్తున్నాం. ‘పీవీసీయూ’పై మీరు వింటున్న రూమర్స్‌ అన్నీ నిజమే. పాత్రల ఎమోషన్‌, కంటెంట్‌, వీఎఫ్‌ఎక్స్‌.. ఇలా అన్నింటిలో ‘జై హనుమాన్‌’ (హనుమాన్‌కు సీక్వెల్‌) మరో స్థాయిలో ఉంటుంది’’ అని ప్రేక్షకుల్లో అంచనాలు పెంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని