Salaar: 114 రోజుల్లోనే ‘సలార్’ను పూర్తిచేశాం.. ఆసక్తికర విషయాలు పంచుకున్న ప్రశాంత్ నీల్‌

ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తోన్న యాక్షన్‌ సినిమా ‘సలార్‌’ (Salaar). తాజాగా దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను దర్శకుడు పంచుకున్నారు.

Updated : 02 Dec 2023 23:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌:  సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘సలార్‌’ ట్రైలర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్‌తో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ సృష్టిస్తోంది. ప్రశాంత్‌ నీల్ (Prashanth Neel) టేకింగ్‌కు ప్రభాస్‌ (Prabhas) యాక్షన్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను దర్శకుడు పంచుకున్నారు.

‘‘సలార్‌’ కథ 15 ఏళ్ల క్రితమే అనుకున్నాను. కానీ, నా మొదటి సినిమా ‘ఉగ్రం’ చేసిన తర్వాత ‘కేజీఎఫ్‌’ ప్రాజెక్ట్‌ మొదలు పెట్టాను. అది రెండు భాగాలు పూర్తయ్యే సరికి 8 సంవత్సరాలు పట్టింది. దాని తర్వాత ‘సలార్’ పనులు ప్రారంభించాం. దీని షూటింగ్‌ ఎక్కువ భాగం రామోజీ ఫిల్మ్‌ సిటీలోనే పూర్తి చేశాం. అలాగే సింగరేణి మైన్స్‌, మంగళూరు, వైజాగ్‌ పోర్టుల్లోనూ కొన్ని షెడ్యూళ్లు జరిపాం. యూరప్‌లోనూ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాం. సినిమా మొత్తాన్ని 114 రోజుల్లో పూర్తి చేశాం’’ అన్నారు. ఇక ‘సలార్‌’ రెండో భాగానికి సంబంధించిన పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ప్రశాంత్‌నీల్‌ చెప్పారు.

ప్రభాస్‌ ‘సలార్‌’ ట్రైలర్‌ వచ్చేసింది.. మరిన్ని అంచనాలు పెంచేలా..!

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్షన్‌ చిత్రం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో అంచనాలు రెట్టింపయ్యాయి. బద్ధ శత్రువులుగా మారే ఇద్దరు స్నేహితుల కథాంశంతో ‘సలార్‌’ (Salaar) రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ (salaar heroine) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) విలన్‌గా కనిపించనున్నారు. టీనూ ఆనంద్‌, జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని