Premalu: ఓటీటీలోకి ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే.?

ఇటీవల కాలంలో యూత్‌ను బాగా ఆకర్షించిన మలయాళీ ప్రేమకథా చిత్రం ‘ప్రేమలు’. ఇప్పుడు ఇది ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Updated : 07 Apr 2024 11:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ఘన విజయాన్ని అందుకున్న మలయాళీ యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ప్రేమలు’. గిరీశ్‌ ఎ.డి. దర్శకుడు. నస్లెన్‌ కె.గఫూర్‌, మ్యాథ్యూ థామస్‌, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి నెలలో విడుదలై మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకుంది. ఇదే చిత్రాన్ని రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ తెలుగులో విడుదల చేసి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడీ చిత్రం ఓటీటీ వేదికగా వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా ఏప్రిల్ 12 నుంచి ఇది అందుబాటులో ఉండనుంది. కేవలం తెలుగు వెర్షన్‌ మాత్రమే ఇక్కడ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ తాజాగా ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టింది. ‘మోడ్రన్‌ లవ్‌ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది. ఇదే రోజున డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ ఇది స్ట్రీమింగ్‌ కానున్న విషయం తెలిసిందే.

క‌థేంటంటే: స‌చిన్ సంతోష్ (నాస్లెన్ కె.గ‌ఫూర్‌) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌. కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ.. ఆ విష‌యాన్ని చెప్పేందుకు ధైర్యం స‌రిపోదు. కాలేజీలో చివ‌రిరోజు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తాడు. ఆ అమ్మాయేమో అప్ప‌టికే వేరొక‌రితో ప్రేమ‌లో ఉన్నాన‌ని చెబుతుంది. అలా తొలిసారి ప్రేమ‌లో విఫ‌ల‌మైన స‌చిన్‌... యూకే వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. తీరా చూస్తే వీసా రాదు.  దాంతో గేట్ కోచింగ్‌ కోసం స్నేహితుడు అమూల్ డేవిస్ (సంగీత్ ప్ర‌తాప్‌)తో క‌లిసి హైద‌రాబాద్ చేరుకుంటాడు. అక్క‌డే రీనూ (మ‌మిత బైజు) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా చేరుతుంది. ఓ పెళ్లి వేడుక‌లో వీరిద్దరూ క‌లుస్తారు. తొలి చూపులోనే ఆమె ప్రేమ‌లో ప‌డిపోతాడు. మ‌రి ఈసారైనా స‌చిన్ ప్రేమక‌థ సుఖాంత‌మైందా? లేక మ‌ళ్లీ అత‌ని హార్ట్ బ్రేక్ అయ్యిందా? అన్నది మిగిలిన కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని