Balakrishna: బాలయ్యబాబు కూర్చొన్న దగ్గర ఏ బాటిల్‌ లేదు.. అదంతా సీజీ: నాగవంశీ

 గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి ఈవెంట్‌లో బాలకృష్ణ కూర్చొన్న కుర్చీ దగ్గర మందుబాటిల్‌ ఉందంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియోను వైరల్‌ చేశారు. దీనిపై నిర్మాత నాగవంశీ స్పష్టత ఇచ్చారు.

Updated : 30 May 2024 16:18 IST

హైదరాబాద్: విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా ‘గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari). ఇటీవల జరిగిన ప్రీరిలీజ్‌ వేడుకకు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna) విచ్చేసి సందడి చేశారు. ఈ మూవీ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అయితే, ఈవెంట్‌లో బాలకృష్ణ కూర్చొన్న కుర్చీ దగ్గర మందుబాటిల్‌ ఉందంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల వేదికగా  ఓ వీడియోను వైరల్‌ చేశారు. దీనిపై చిత్ర నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ సీజీ (కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌)లో క్రియేట్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. ఈవెంట్‌ నిర్వహించడంతో పాటు, ఆసాంతం తాను అక్కడే ఉన్నానని అసలు అలాంటి బాటిల్‌ ఏదీ లేదని తెలిపారు. కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్‌మీడియాలో అనవసర చర్చ తప్ప ఏమీ లేదన్నారు. దీనిపై కథానాయకుడు విశ్వక్‌సేన్‌ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ఆ వీడియోను సీజీలో క్రియేట్‌ చేసిన వ్యక్తి ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి-2’ కోసం పని చేయబోతున్నారని చురకలు అంటించారు.

ఇక వేదికపై నటి అంజలిని బాలకృష్ణ చేతితో నెట్టడంపైనా నాగవంశీ స్పందించారు. కార్యక్రమంలో పెద్ద శబ్దాల వల్ల సరిగా వినిపించకపోవడంతో ఫొటోకు పోజు ఇచ్చేందుకు వెనక్కి జరగాలని బాలయ్య చనువుకొద్దీ అలా చేశారని అన్నారు. నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు తమకున్న పరిచయం, చనువును బట్టి అలా ఎవరైనా చేస్తారని అన్నారు. ఆ చర్యకు ముందూ, వెనక ఉన్న పూర్తి వీడియోను చూడకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయడం తగదని అన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ, అంజలి హై ఫై అంటూ చేతులతో చప్పట్లు చరుచుకున్న సీన్‌ ఎవరూ చూపించలేదన్నారు.

ఎందుకు స్పెషల్‌ షోలు..?

మీడియా కోసం ప్రత్యేకంగా షోలు వేయాల్సిన అవసరం లేదని, రివ్యూ కోసం సినిమా చూడాలనుకుంటే టికెట్‌ కొనుక్కొని చూసి, రాయొచ్చని నిర్మాత నాగవంశీ అన్నారు. మీడియా వాళ్లు కూడా తమ కుటుంబాలతో కలిసి సినిమా చూడాలనే ఉద్దేశంతో స్పెషల్‌ షో వేయడం లేదన్నారు. కావాలనుకుంటే సినిమా విడుదలైన రెండోరోజు స్పెషల్‌ షో వేస్తామన్నారు. మరోవైపు విశ్వక్‌సేన్‌ కూడా ఈ విషయమై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కేవలం మీడియా మాత్రమే స్పెషల్‌ షో చూస్తే, ఎలాంటి స్పందన లేకుండా మౌనంగా ఉండటం వల్ల తాము ఏదైనా తప్పు చేశామా? అన్న భావన కలుగుతోందన్నారు. అదే ప్రేక్షకుల మధ్య మూవీ చూస్తే వాళ్ల పల్స్‌ తెలుస్తుందన్నారు. అందుకే ప్రీమియర్‌ చూడాలనుకునే మీడియా మిత్రులు సగం మంది ఒక స్క్రీన్‌లో, మిగిలిన సగం మరొక స్క్రీన్‌లో ప్రేక్షకుల మధ్య చూస్తే, వాళ్లు ఎలా స్పందిస్తున్నారో తెలుస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు