SSMB29: మహేశ్‌తో సినిమాపై రాజమౌళి కామెంట్స్‌..

మహేశ్‌ (Mahesh Babu)తో తీయనున్న చిత్రంపై రాజమౌళి తాజాగా కామెంట్ చేశారు.

Published : 01 Mar 2024 15:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు మహేశ్‌ బాబు (Mahesh Babu)ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ( SSMB29 ) ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన చిన్న విషయం బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్‌గా మారుతోంది.

తాజాగా రాజమౌళి బళ్లారిలోని అమృతేశ్వర ఆలయ ప్రారంభోత్సవానికి కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఆ కార్యక్రమం అనంతరం అక్కడి రాజకీయ నాయకులతో మాట్లాడారు. ఆ సందర్భంలో మహేశ్‌తో సినిమా గురించి ఆయన కామెంట్స్‌ చేశారు. ‘మహేశ్‌తో సినిమా తీస్తున్నా.  త్వరలోనే దాని షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్‌ టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు’ అన్నారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను మహేశ్‌ అభిమానులు షేర్‌ చేస్తున్నారు. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ (Vijayendra Prasad) కథను అందిస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథ సాగనుంది. మహేశ్‌ ఇంటెన్సిటీ ఉన్న నటుడని.. ఇది ఎంతో సాహసోపేతమైన కథ అని విజయేంద్ర ప్రసాద్‌ గతంలో అన్నారు.

రివ్యూ: ఆపరేషన్‌ వాలెంటైన్‌.. వరుణ్ ఖాతాలో హిట్‌ పడిందా?

ఈ సినిమా గురించి ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు ప్రచారమయ్యాయి. తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘మహారాజ్‌’ (Maharaj) అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇందులో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా, హాలీవుడ్‌ ప్రముఖ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ కీలకపాత్ర పోషించనున్నారని కూడా జోరుగా ప్రచారమవుతోంది. మరోవైపు మహేశ్‌బాబు కూడా ఈ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. తన లుక్‌ను కూడా మార్చుకున్నారు. తాజాగా ఆయన షేర్‌ చేసిన ఫొటోల్లో న్యూ లుక్‌లో కనిపించారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని టాక్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని