Rakul Preet Singh: అదొక కీలక నిర్ణయం.. ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నా: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

నటిగా తన కెరీర్‌ ఎలా మొదలైందో నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) తెలియజేశారు. సినిమా ఆఫర్స్‌ కోసం ఓ సమయంలో కుటుంబానికి దూరంగా ముంబయిలో ఒక్కదాన్నే ఉన్నానని ఆమె చెప్పారు.

Updated : 29 Sep 2023 14:04 IST

ముంబయి: భూమి ఫడ్నేకర్‌, షెహనాజ్‌ గిల్‌, కుషా కపిలా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌’ (Thank you for Coming). యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తన సినీ కెరీర్‌ ఎలా మొదలైందో తెలియజేస్తూ భూమి ఫడ్నేకర్‌ ఇటీవల ఓ పోస్ట్‌ పెట్టారు. అనంతరం ఆమె రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అనిల్‌ కపూర్‌తోపాటు పలువురు యువ నటీనటులను ట్యాగ్‌ చేస్తూ.. వారి కథలనూ తెలియజేయాలని కోరారు. దీంతో రకుల్‌ (Rakul Preet Singh) తాజాగా తన ప్రయాణాన్ని అందరితో పంచుకున్నారిలా..

‘‘చిన్నప్పటి నుంచే సినిమాల్లోకి రావాలని కలలు కన్న అమ్మాయిని నేను. ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియని రోజుల్లో మోడలింగ్‌ నుంచి మిస్‌ ఇండియా.. అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చాను. అందరిలాగే ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, తిరస్కరణలు ఎదుర్కొన్నా. పరిశ్రమలోకి అడుగుపెట్టాలన్న ఆశతో కుటుంబాన్ని వదిలి ముంబయిలో అడుగుపెట్టి ఒక్కదాన్నే జీవితాన్ని కొనసాగించాను. అదే నేను తీసుకున్న కీలక నిర్ణయం. ఆడిషన్స్‌ కోసం క్యూ లైన్స్‌లో నిలబడటం.. ఆఫర్స్‌ కోసం క్యాస్టింగ్‌ ఏజెంట్స్‌ - డైరెక్టర్స్‌కు వరుస కాల్స్‌ చేయడం.. కొన్ని సినిమాలకు సంతకం చేసిన తర్వాత.. చివరి నిమిషంలో నా స్థానంలో వేరే ఒకరిని తీసుకోవడం.. ఇలాంటి ఎన్నో అనుభవాలు చూశా. చివరకు సినిమాల్లోకి అడుగుపెట్టి ఇప్పుడు మీ అందరి మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నా. ధైర్యం, నమ్మకంతో ప్రతీ సమస్యను ఎదుర్కొన్నాను. కఠోర శ్రమతో లక్ష్యాన్ని చేధించాను. ఈ ప్రయాణంలో ప్రతీది ఒక అందమైన పాఠాన్ని నేర్పించింది. కుటుంబం తోడుగా ఉండటంతోనే ఈ స్థాయికి రాగలిగాను’’ అని ఆమె రాసుకొచ్చారు.

రివ్యూ: పాపం పసివాడు.. సింగర్‌ శ్రీరామ చంద్ర నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

‘గిల్లీ’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ‘కెరటం’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో మొదటి విజయాన్ని దక్కించుకున్నారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీని తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వరించాయి. ‘లౌక్యం’, ‘ధృవ’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, ‘మన్మథుడు 2’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని