Papam Pasivadu Review: రివ్యూ: పాపం పసివాడు.. సింగర్‌ శ్రీరామ చంద్ర నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

Papam Pasivadu Review: సింగర్‌ శ్రీరామ చంద్ర ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్‌ సిరీస్‌ ‘పాపం పసివాడు’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సిరీస్‌ ఎలా ఉందో తెలుసుకోవానుకుంటే రివ్యూపై లుక్కేయండి..

Updated : 29 Sep 2023 12:56 IST

Papam Pasivadu Review| వెబ్‌సిరీస్‌: పాపం పసివాడు; నటీనటులు: శ్రీరామ చంద్ర, రాశీ సింగ్‌, గాయత్రి చాగంటి, శ్రీవిద్య మహర్షి, మ్యాడీ మనేపల్లి, అశోక్‌ కుమార్‌, సుజాత, శ్రీనివాస్ తదితరులు; కూర్పు: విప్లవ్‌ నైషధం; ఛాయాగ్రహణం: గోకుల్‌ భారతి; సంగీతం, సాహిత్యం: జోస్‌ జిమ్మీ; నిర్మాత: అఖిలేష్‌ వర్ధన్‌; దర్శకత్వం: లలిత్‌ కుమార్‌; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: ఆహా.

ప్రముఖ గాయకుడు, ‘ఇండియన్‌ ఐడల్‌ 5’ విన్నర్‌ శ్రీరామ చంద్ర (Sreerama Chandra) ప్రధాన పాత్రలో దర్శకుడు లలిత్‌ కుమార్‌ రూపొందించిన వెబ్‌ సిరీస్‌ ‘పాపం పసివాడు’ (Papam Pasivadu). రాశీ సింగ్‌ (Raashi Singh), గాయత్రి చాగంటి (gayatri chaganti), శ్రీవిద్య మహర్షి (Sri Vidhya Maharshi) కథానాయికలు. ఈ సిరీస్‌ ఓటీటీ ‘ఆహా’ (Aha)లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. కథేంటి? ఎలా ఉందంటే?(Papam Pasivadu Review)..

ఇదీ కథ: క్రాంతి (శ్రీరామ చంద్ర), డింపీ (గాయత్రి) ఆరేళ్లుగా ప్రేమలో ఉంటారు. పెళ్లి చేసుకుందామని క్రాంతి ఓ రోజు మనసులో మాట బయటపెట్టగా డింపీ తిరస్కరిస్తుంది. ఆమె బ్రేకప్‌ చెప్పిందనే బాధతో క్రాంతి దేవదాసులా మారిపోతాడు. మరోవైపు, 30 ఏళ్లు దాటినా పెళ్లిచేసుకోవా? అంటూ క్రాంతిని అతడి తల్లి పదే పదే ప్రశ్నిస్తుంది. బ్రేకప్‌ నుంచి తేరుకునేందుకు, పెళ్లిగోల నుంచి బయటపడేందుకు ఇల్లు విడిచి స్నేహితులతో కలిసి ఉంటాడు క్రాంతి. ఈ క్రమంలో ఓ పార్టీకి వెళ్లగా అక్కడ చారు (రాశీ సింగ్‌)ను చూస్తాడు. ఆమె నివసించే అపార్ట్‌మెంట్‌ ఏదో తెలిసినా కలుసుకోలేకపోతాడు. చారును వెతికే క్రమంలో.. పెళ్లి చేసుకోవాలంటూ తల్లి ఒత్తిడి పెంచగా చివరకు క్రాంతి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాడు. అలా అనూష (శ్రీవిద్య)తో క్రాంతి నిశ్చితార్థం జరుగుతుండగా ఊహించని విధంగా చారు ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? క్రాంతి తన మనసులో మాట చారుకు చెప్పాడా ? చారును ప్రేమించే రాఖీ ఎవరు? అనూష, చారులలో క్రాంతి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? బ్రేకప్ చెప్పిన డింపీ.. క్రాంతి లైఫ్‌లోకి మళ్లీ ఎందుకొచ్చింది? అన్నది మిగతా కథ. (Papam Pasivadu Review).

ఎలా ఉందంటే: ముగ్గురు అమ్మాయిల వల్ల ఓ అబ్బాయి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేదే ఈ సిరీస్‌ సారాంశం. అలా అని ఇదేదో ట్రాజెడీ స్టోరీ అనుకుంటే పొరపాటే! వినోదాత్మకంగా ఉంటుంది. ఒకరితో లవ్‌ బ్రేకప్‌ అయితే తప్పని పరిస్థితుల్లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు హీరో సిద్ధపడడమనే కాన్సెప్ట్‌ ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. అదే తరహా స్టోరీ అయినప్పటికీ లవ్‌ బ్రేకప్‌, ఎంగేజ్‌మెంట్‌కు మధ్య హీరో మరో అమ్మాయికి ఆకర్షితుడవడం, ఆ పాత్రకు ట్విస్ట్‌ ముడిపడి ఉండడం అనేది ఇక్కడ కొత్త అంశం. క్రాంతి పరిచయం సన్నివేశంతోనే సిరీస్‌ని ప్రారంభించి ఆసక్తి రేకెత్తించారు దర్శకుడు. అతడి వర్జినిటీ పోగొట్టిందెవరనే దాన్ని చూపించే క్రమంలో ఫ్లాష్‌ బ్యాక్‌ని తెరపైకి తీసుకొచ్చారు. రొటీన్‌కు భిన్నంగా.. ‘ఇక్కడ నుంచి కాదు.. ఇంకా వెనక్కి’ అంటూ ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ని రివీల్‌ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఆ గతంలోనే డింపీ బ్రేకప్‌ చెప్పడం కనిపిస్తుంది. అయితే, క్రాంతి- డింపీల స్టోరీ గురించి ప్రస్తావించకుండా బ్రేకప్‌తో సింపుల్‌గా తేల్చేశారు. వారిద్దరి ట్రాక్‌ ఇంకా ఉంటే బాగుంటుందని ప్రేక్షకుడికి తప్పక అనిపిస్తుంది (Papam Pasivadu Review).

రివ్యూ స్కంద.. రామ్‌-బోయపాటి కాంబినేషన్‌ మెప్పించిందా?

క్రాంతి కుటుంబం నేపథ్యంలో, అతడి స్నేహితుల మధ్య వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా క్రాంతి, అతడి తల్లి పెళ్లి గురించి సాగించే చర్చలు పెళ్లికాని చాలామందికి కనెక్ట్‌ అవుతాయి. క్రాంతి- చారు మీట్‌ అయ్యే సీన్‌ ‘ఇలా కూడా పరిచయాలు పెంచుకోవచ్చా?’ అని అనిపిస్తుంది. అయితే, చారు నివసించే అపార్ట్‌మెంట్‌ ఏదో తెలిసినా ఆమెను క్రాంతి కలుసుకోలేకపోవడం అనేది సిల్లీగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జోస్యం చెప్పే వ్యక్తిగా వేణు యెల్దండితో క్రియేట్‌ చేసిన కామెడీ ఫర్వాలేదనిపిస్తుంది. అనూష పాత్ర ఎంట్రీతో స్టోరీ టెంపో మారుతుంది. ‘ఇంతకీ ఈ హీరో ఏం పనిచేస్తుంటాడు?’ అనే సందేహంలో ఉన్న ప్రేక్షకుడికి సమాధానం అప్పుడే తెలుస్తుంది. ఈ ఇద్దరి ముచ్చట్లు మెప్పిస్తాయి. ఓ వైపు అనూషతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న క్రాంతి చారుతో ప్రేమాయణం నడపడం, మళ్ళీ అతడి జీవితంలోకి డింపీ రావడం... లాంటి మలుపులు మెప్పిస్తాయి. చారుని ప్రేమించే రాఖీ పాత్రతోనూ కామెడీ పంచారు దర్శకుడు. ఊహించని క్లైమాక్స్‌తో సీరీస్ ముగించారు. సరదాగా సాగుతూ మంచి కాలక్షేపాన్ని ఇస్తే చాలనుకుంటే ఈ సిరీస్‌ను చూడొచ్చు (Papam Pasivadu Review).

ఎవరెలా చేశారంటే: లవ్‌ ఫెయిల్యూర్‌ అయిన వ్యక్తిగా, తల్లి మాట కాదనలేని కొడుకుగా క్రాంతి పాత్రలో శ్రీరామ చంద్ర ఒదిగిపోయారు. ఆయన నటన, డ్రెస్సింగ్‌ స్టైల్‌ ఆకట్టుకుంటాయి. ముగ్గురు హీరోయిన్లు తమ అందం, అభినయంతో అలరిస్తారు. గాయత్రి చాగంటికి స్క్రీన్‌ స్పేస్‌ తక్కువ. క్రాంతి తల్లి, తండ్రి, స్నేహితుల పాత్రధారులు పరిధి పరిమేరకు నటించారు. సాంకేతికంగా సిరీస్‌ బాగుంది (Papam Pasivadu Review).

మ్యూజిక్‌: సందర్భానుసారం ర్యాప్‌ పాటలనే కాకుండా ఓల్డ్‌ క్లాసిక్స్‌ను వినిపించి వావ్‌ అనిపించారు సంగీత దర్శకుడు జోస్‌ జిమ్మీ. నేపథ్య సంగీతంతో ఆయా సన్నివేశాలకు బలాన్ని చేకూర్చారు. క్రాంతి- చారుల మధ్య సాగే సన్నివేశాల్లో వినిపించే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ విశేషంగా అలరిస్తుంది.

సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌: గోకుల్‌ భారతి కెమెరా వర్క్‌ బాగుంది. డింపీ, చారు, అనూష.. వీరిని ఫస్ట్‌టైమ్‌ చూసినప్పుడు హీరో ఊహల్లోకి వెళ్లే విజువల్స్‌ అదుర్స్‌ అనిపిస్తాయి. ఒక్కో ఎపిసోడ్‌ 30 నిమిషాలకన్నా తక్కువే. మొత్తం ఐదు ఎపిసోడ్లు. ఎడిటింగ్‌ విషయంలో విప్లవ్‌ నైషధం ఓకే. ఒకట్రెండు సన్నివేశాల విషయంలో మినహా ఇంకా ‘కట్‌’ చేయడానికి స్కోప్‌ లేదనే చెప్పొచ్చు.

డైరెక్షన్‌ మాటేంటంటే: తెలిసిన కథే అయినా దానికి హాస్యాన్ని జోడించి ప్రేక్షకుడిని ఎంగేజ్‌ చేయగలిగారు లలిత్‌ కుమార్‌. హీరోని కన్ఫ్యూజన్‌లో పెట్టినా ప్రేక్షకుడు తికమక పడుకుండా అర్థవంతంగా కథను నడింపించారు.

ఎవరెవరు చూడొచ్చు: యువతను ఎక్కువగా ఆకట్టుకునే సిరీస్‌ ఇది. చాలామందికి కనెక్ట్‌ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చుగానీ ఒకట్రెండు చోట్ల ఫార్వాడ్‌ బటన్‌ నొక్కాల్సిందే! 

  • బలాలు
  • + శ్రీరామ చంద్ర నటన
  • + కామెడీ
  • + క్లైమాక్స్‌
  • బలహీనతలు
  • - చారు ఆచూకీ కోసం క్రాంతి చేసే ప్రయత్నం 
  • - కొత్తదనం లేని కథ
  • చివ‌రిగా: ఈ ‘పసివాడు’.. బాగా నవ్విస్తాడు (Papam Pasivadu Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని