Ram Charan: డాక్టర్‌ రామ్‌చరణ్‌

కథానాయకుడు రామ్‌చరణ్‌ గౌరవ డాక్టరేట్‌ని అందుకున్నారు. వినోద రంగంలో చేసిన సేవలకిగానూ తమిళనాడులోని వేల్స్‌ విశ్వవిద్యాలయం  నుంచి ఆయన ఈ గౌరవాన్ని పొందారు.

Updated : 14 Apr 2024 13:11 IST

థానాయకుడు రామ్‌చరణ్‌ గౌరవ డాక్టరేట్‌ని అందుకున్నారు. వినోద రంగంలో చేసిన సేవలకిగానూ తమిళనాడులోని వేల్స్‌ విశ్వవిద్యాలయం  నుంచి ఆయన ఈ గౌరవాన్ని పొందారు. శనివారం చెన్నైలో జరిగిన విశ్వ విద్యాలయ స్నాతకోత్సవానికి హాజరైన రామ్‌చరణ్‌కు ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ఛైర్మన్‌  టి.జి.సీతారాం, విశ్వ విద్యాలయం ఛాన్సలర్‌, ఛైర్మన్‌  ఇషారి కె.గణేశ్‌ కలిసి డాక్టరేట్‌ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘‘నా సేవల్ని గుర్తించి, నాపై ఇంత ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తూ డాక్టరేట్‌ని ప్రదానం చేసిన వేల్స్‌ విశ్వ విద్యాలయానికి నా ధన్యవాదాలు. ఈ గౌరవం నాది కాదు. నా అభిమానులు, దర్శకులు, నిర్మాతలు, తోటి నటీనటులకి చెందుతుంది. చెన్నై నాకెంతో ఇచ్చింది. నేను ఇక్కడే పుట్టాను.  మా నాన్న ఇక్కడి నుంచే ప్రయాణం ప్రారంభించారు. తెలుగు  చిత్రపరిశ్రమలో ఎనభై శాతం మందికి చెన్నైతో అనుబంధం ఉంది. ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ఇక్కడికి వస్తే అది తప్పక నెరవేరుతుంది. అదీ ఈ ప్రాంతానికి ఉన్న గొప్పతనం. శంకర్‌ దర్శకత్వంలో సినిమా చేయాలని చాలా మంది అనుకుంటారు. ఆయనతో ‘గేమ్‌ ఛేంజర్‌’ చేయడం ఓ గొప్ప అనుభవం’’ అన్నారు.

గర్వంగా ఉంది: చిరంజీవి: రామ్‌చరణ్‌ డాక్టరేట్‌ అందుకోవడంపై ఆయన తండ్రి, ప్రముఖ కథానాయకుడు చిరంజీవి తన ఆనందాన్ని ఎక్స్‌ ద్వారా పంచుకున్నారు. ‘‘ఇవి భావోద్వేగంతో కూడిన క్షణాలు. పిల్లలు విజయాల్ని సాధిస్తున్నప్పుడే తల్లిదండ్రులకు అసలైన ఆనందం. వేల్స్‌ విశ్వ విద్యాలయం రామ్‌చరణ్‌కు డాక్టరేట్‌ అందించడం చూసి గర్వపడుతున్నా. చెప్పలేనంత ఆనందంగా ఉంది. లవ్‌ యూ డాక్టర్‌ రామ్‌చరణ్‌’’ అంటూ పోస్ట్‌ని పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని