Rana Daggubati: త్రివిక్రమ్‌ కథ.. రానా హీరో.. ఆసక్తి రేకెత్తిస్తోన్న ప్రాజెక్ట్‌

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ కథతో తెరకెక్కబోయే సినిమాలో రానా హీరోగా నటించనున్నారు. సంబంధిత ప్రకటన తాజాగా వెలువడింది.

Published : 20 Jul 2023 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) తన అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా పలు ఆసక్తిర ప్రాజెక్టులు ప్రకటించారు. హీరోగా, నిర్మాతగా తదుపరి తాను పనిచేయనున్న సినిమాల జాబితా వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ (San Diego Comic Con) వేడుకల్లో పాల్గొనేందుకు ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్ర బృందంతోపాటు రానా అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే ఈ వివరాలు వెల్లడించారు. అవేంటంటే?

‘హిరణ్య కశ్యప’ (Hiranya Kashyap) సినిమాలో రానా హీరోగా నటించనున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) కథ అందించనున్నారు. అమరచిత్ర కథలు ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. సూపర్‌హిట్‌ మలయాళ చిత్రం ‘మిన్నల్‌ మురళి’ (Minnal Murali)ని కామిక్‌ రూపంలో ‘టింకిల్‌’ (Tinkle) పేరుతో నిర్మించనున్నారు. రానాకు చెందిన స్పిరిట్‌ మీడియా, వీకెండ్‌ బ్లాక్‌బస్టర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. మరోవైపు, ఓటీటీ ‘సోనీలివ్‌’ (SonyLiv)తో కలిసి స్పిరిట్‌ మీడియా సంస్థ.. ‘లార్డ్స్‌ ఆఫ్‌ ది డెక్కన్‌’ (Lords of the Deccan) అనే హిస్టారికల్‌ వెబ్‌సిరీస్‌ నిర్మించనుంది. రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్‌ గతంలోనే ప్రకటించారు. ఆయన ‘శాకుంతలం’తో బిజీకావడం, ఇతరత్రా కారణాల వల్ల ఆ ప్రాజెక్టును కొన్ని రోజులు పక్కకు పెట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి, రానా ప్రకటించిన ప్రాజెక్టు అదేనా? దర్శకత్వం వహించేది గుణశేఖరేనా? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

‘ప్రాజెక్ట్‌ కె’.. ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌ అదిరింది

‘ప్రాజెక్ట్‌ కె’ (Project K) విషయానికొస్తే.. ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రమిది. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్ర బృందానికి  ‘శాన్‌ డియాగో కామిక్‌ కాన్‌’లో పాల్గొనే అవకాశం దక్కింది. అదే వేడుకలో టైటిల్‌ని ప్రకటించి, ట్రైలర్‌ విడుదల (యూఎస్‌లో జులై 20, ఇండియాలో జులై 21న) చేయనున్నారు. కామిక్‌ కాన్‌ వేదికపై ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించనున్న తొలి భారతీయ చిత్రంగా ‘ప్రాజెక్ట్‌ కె’ చరిత్ర సృష్టించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని