Rana: దుల్కర్‌, సోనమ్‌ కపూర్‌లకు రానా క్షమాపణలు..

తన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారని రానా (Rana) అన్నారు. దుల్కర్‌, సోనమ్‌ కపూర్‌లకు ఆయన క్షమాపణలు చెప్పారు.

Updated : 15 Aug 2023 15:02 IST

హైదరాబాద్‌: ఇటీవల జరిగిన ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ (King of Kotha) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో రానా (Rana) మాటలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో నేడు తన సోషల్‌ మీడియా వేదికగా దుల్కర్‌, సోనమ్‌ కపూర్‌లకు (Sonam Kapoor) ఆయన క్షమాపణలు చెప్పారు. వాళ్లంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ వైరలవుతోంది. అసలు విషయమేమిటంటే..

దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా  అభిలాష్‌ జోషిలీ తెరకెక్కించిన చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ (King of Kotha). ఇటీవల దీని ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. దానికి రానా, నాని ముఖ్య అతిథులుగా వెళ్లారు. ఆ ఈవెంట్‌లో రానా మాట్లాడుతూ.. ‘‘దుల్కర్‌కు చాలా సహనం.  నేను ఓసారి తన సినిమా షూటింగ్‌కు వెళ్లాను. అక్కడ ఓ స్టార్‌ హీరోయిన్ చాలా సమయాన్ని వృథా చేసింది. ఆమె కోసం దుల్కర్‌ ఎండలో వేచిచూస్తుంటే.. ఆమె మాత్రం తన భర్తతో షాపింగ్‌ గురించి చాలాసేపు మాట్లాడుతూనే ఉంది. అది చూసి నాకు కోపం వచ్చింది. నా చేతిలో ఉన్న వాటర్‌ బాటిల్‌ విసిరేశాను. కానీ, దుల్కర్‌ మాత్రం చాలా ప్రశాంతంగా షూటింగ్‌ పూర్తి చేశాడు’’ అని అన్నారు. దీంతో నెటిజన్లంతా ఆ హీరోయిన్ సోనమ్‌ కపూర్‌ అంటూ ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై రానా తన ట్విటర్‌లో వివరణ ఇస్తూ వాళ్లకు క్షమాపణలు చెప్పారు.

హిందీలోనూ ‘భోళా శంకర్‌’.. విడుదల ఎప్పుడంటే?

‘‘నా వ్యాఖ్యలను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. తనను ట్రోల్ చేస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది. మేమంతా స్నేహితులం. దుల్కర్‌, సోనమ్‌ అంటే నాకు ఎంతో గౌరవం. నా మాటల వల్ల వాళ్లు చాలా ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు. అందుకే వాళ్లకు క్షమాణలు చెబుతున్నాను. ఇప్పటితో ఈ వివాదానికి ముగింపు పలుకుతారని ఆశిస్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని