Rana- Mrunal Thakur: రానా- మృణాళ్‌ ఠాకూర్‌ ఫొటోలు వైరల్‌.. ఎక్కడ మెరిశారంటే?

హీరో హీరోయిన్లు రానా, మృణాళ్‌ ఠాకూర్‌ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల వెనుక ఉన్న సంగతేంటంటే?

Published : 07 Jul 2023 23:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరో రానా (Rana Daggubati), హీరోయిన్‌ మృణాళ్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కలిసి దిగిన ఫొటోలు నెట్టింట అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వీరిద్దరూ కలిసి ఏదైనా సినిమాలోనో, వెబ్‌సిరీస్‌లోనో నటిస్తున్నారేమోనని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంబోలో ‘రానా నాయుడు 2’ సిరీస్‌ వస్తుందని కొందరు జోస్యం చెబుతున్నారు. ఇంతకీ వీరు కలిసి ఫొటో దిగడానికి కారణమేంటంటే?

సినిమా పరిశ్రమలో అందించే ప్రముఖ అవార్డుల్లో ‘సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) (SIIMA)’ ఒకటి. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి అందించే ఈ అవార్డుల కార్యక్రమం ఈ ఏడాది సెప్టెంబరు 15, 16న దుబాయ్‌లో జరగనుంది. ఈసారి సైమాతో కలిసి ‘నెక్సా’ భాగస్వామి కానుంది. ఈ మేరకు దుబాయ్‌లో నిర్వహించిన ‘నెక్సా సైమా పార్ట్‌నర్‌షిప్‌’ కార్యక్రమానికి రానా, మృణాళ్‌ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ‘సైమా’ ఛైర్‌పర్సన్‌ బృందా ప్రసాద్‌కి మృణాళ్‌ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. రానాతో వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. రానా, ఆయన బాబాయ్‌ వెంకటేశ్‌ కలిసి నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu) ప్రచారంలో భాగంగా మృణాళ్‌ ఓ స్కిట్‌ చేసిన సంగతి తెలిసిందే. అందులో.. తన ఈ-మెయిల్‌ ఖాతా హ్యాక్‌కు గురైందంటూ.. సమస్య పరిష్కారానికి రానాను సంప్రదిస్తారు మృణాళ్‌. అప్పుడు అలా ప్రత్యేక వీడియోలో నటించడం, ఇప్పుడిలా ఒకే వేదికపై కనిపించడంతో వీరిద్దరు ‘రానా నాయుడు’ పార్ట్‌ 2లో నటిస్తారని పలువురు అభిప్రాయపడ్డారు. 

‘భీమ్లా నాయక్‌’, ‘విరాటపర్వం’ చిత్రాలతో గతేడాది అలరించిన రానా.. ఇటీవల ‘స్పై’ (Spy)లో అతిథిగా కనిపించారు. నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన చిత్రమిది. ‘సీతారామం’లో సీత పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాళ్‌.. హీరో నాని (Nani) సరసన ఓ సినిమాలో నటిస్తున్నారు. #nani30 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 21న విడుదల కానుంది. మరోవైపు, విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా దర్శకుడు పరశురామ్‌ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో మృణాళ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని