Rashmika: ఇక ఇప్పుడు శ్రీవల్లి 2.0..: రష్మిక

‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule)లో తన పాత్రను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి రష్మిక (Rashmika).

Updated : 14 Apr 2024 14:33 IST

హైదరాబాద్‌: ‘పుష్ప ది రైజ్‌’ (Pushpa The Rise)కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule). ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ కోసం వర్క్‌ చేస్తున్నారు నటి రష్మిక (Rashmika). ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సీక్వెల్‌లో తన పాత్ర ఎలా ఉంటుందో తెలిపారు. సవాళ్లతో కూడుకున్నప్పటికీ శ్రీవల్లి పాత్రను పూర్తిగా ఎంజాయ్‌ చేస్తున్నానన్నారు.

‘‘పుష్ప’లో అవకాశం వచ్చినప్పుడు సినిమా కథ ఏమిటో? శ్రీవల్లి పాత్ర ఎలా ఉంటుందో.. దానిని స్క్రీన్‌పైకి ఎలా తీసుకురావాలో నాకు తెలియలేదు. మేము ఎలాంటి ప్రపంచాన్ని క్రియేట్‌ చేస్తున్నామో కూడా ఊహించలేదు. నిజం చెప్పాలంటే అప్పుడు, ‘పుష్ప’కు సంబంధించిన ఏ విషయంపైనా నాకు పెద్దగా అవగాహన లేదు. దాంతో నిత్యం సెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఖాళీ మైదానంలోకి వెళ్తున్న భావన వచ్చేది. కానీ, ఇప్పుడు అలా కాదు. నా పాత్ర, కథ అర్థమైంది. సీక్వెల్‌లో నా రోల్‌ మరింత బలంగా ఉండనుంది.  ఇప్పుడు శ్రీవల్లి 2.0ని చూస్తారు. అది మాత్రమే చెప్పగలను’’ అని ఆమె అన్నారు.

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప ది రైజ్‌’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఇది రూపుదిద్దుకుంది. 2021లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. కథ, స్క్రీన్‌ప్లేతోపాటు పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్‌ నటన విశేష ఆదరణ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. స్మగ్లింగ్‌ సిండికేట్‌కు నాయకుడిగా మారిన తర్వాత పుష్పరాజ్‌ ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? భన్వర్‌ సింగ్‌ షెకావత్‌, దాక్షాయణి, మంగళం శీను నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకున్నాడనే ఆసక్తికర అంశాలతో సీక్వెల్‌ తెరకెక్కుతోంది. ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 15న ఇది విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌, రష్మిక లుక్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని