Rashmika: వాటిని చూసి నా హృదయం ముక్కలైంది: రష్మిక

‘పుష్ప’ తర్వాత కెరీర్‌లో జోరు పెంచారు నటి రష్మిక. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌, కోలీవుడ్‌లలో వరుస సినిమాలు చేస్తోన్న ఈ భామ తాజాగా సోషల్‌మీడియా ట్రోలింగ్‌పై పెదవి విప్పారు. ఈ విధమైన ట్రోల్స్‌ వల్ల తాను ఎన్నోసార్లు బాధపడినట్లు చెప్పారు.

Updated : 09 Nov 2022 11:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌మీడియా వేదికగా తన గురించి వస్తోన్న నెగెటివిటీపై నటి రష్మిక (Rashmika) స్పందించారు. వివరణాత్మక విమర్శలను తాను స్వాగతిస్తానని.. నటిగా ఎదగడానికి అవి ఉపయోగపడతాయని అన్నారు. కానీ, నీచమైన ద్వేషం వల్ల లాభం ఏంటని ప్రశ్నిస్తూ ఇన్‌స్టా వేదికగా ఆమె ఓ పోస్ట్‌ పెట్టారు.

‘‘ఎన్నో ఏళ్ల నుంచి కొన్ని విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. వాటిని ఇప్పుడు మీతో పంచుకోవాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నా. నటిగా కెరీర్‌ మొదలైన నాటి నుంచీ వ్యతిరేకత ఎదుర్కొంటున్నా. సోషల్‌మీడియాలో వచ్చే ట్రోల్స్‌, నెగెటివిటీ నన్ను బాధపెట్టాయి. అయితే.. నేను ఎంచుకున్న జీవితం అలాంటిది. ఇక్కడ అందరికీ నేను నచ్చనని.. అలాగే, ప్రతిఒక్కరి ప్రేమను పొందాలనుకోకూడదని అర్థమైంది. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ప్రతిరోజూ కష్టపడి పనిచేయడం మాత్రమే నాకు తెలుసు. మీరూ, నేనూ గర్వించే విధంగా పనిచేసేందుకే శ్రమిస్తున్నా. అందుకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా’’

‘‘నేను మాట్లాడని విషయాల గురించి కూడా నన్ను హేళన చేస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. వాటిని చూసి నా హృదయం ముక్కలైంది. పలు ఇంటర్వ్యూల్లో నేను మాట్లాడిన కొన్ని మాటలు నాకు వ్యతిరేకంగా మారడాన్ని గుర్తించా. ఇంటర్నెట్‌లో వస్తోన్న తప్పుడు సమాచారం వల్ల నాకే కాకుండా నా సహచరులకు ఇబ్బంది కలిగింది’’ 

విమర్శలను పట్టించుకోకూడదని ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్నా. కానీ, ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. సోషల్‌మీడియా నెగెటివిటీ గురించి మాట్లాడి నేను ఎవరిమీదనో విజయం సాధించానని అనుకోవడం లేదు. నా చుట్టూ ఉన్న ప్రతిఒక్కరిపై నాకు ప్రేమాభిమానం ఉంది. ఇప్పటి వరకూ నేను పనిచేసిన నటీనటుల నుంచి ఎన్నో విషయాల్లో ప్రేరణ పొందా. అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాల వల్లే ఇంతటి గుర్తింపు తెచ్చుకున్నా’’ అంటూ రష్మిక పేర్కొన్నారు.

ఈ పోస్ట్‌ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన సినీ సెలబ్రిటీలు హన్సిక, విమలారామన్‌, తాన్యా హోప్‌, దుల్కర్‌ సల్మాన్‌, వెంకీ కుడుముల తదితరులు ఆమెకు సపోర్ట్‌ చేస్తూ కామెంట్స్‌ పెడుతున్నారు. ‘మా అభిమానం నీకు ఎప్పుడూ ఉంటుంది. ద్వేషం చూపించే వారిని పట్టించుకోవద్దు’ అని రిప్లైలు ఇస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని