Raveena Tandon: హీరోల ఒక్క సినిమా పారితోషికం.. మాకు 15 సినిమాలతో సమానం: రవీనా టాండన్‌

హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాల్లో చాలా వ్యత్యాసం ఉండేదని రవీనా టాండన్ అన్నారు. 

Published : 17 Apr 2024 16:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతంలో హీరోలు ఒక్క సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్‌ హీరోయిన్లు 15 చిత్రాలకు తీసుకునే మొత్తంతో సమానమని బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ అన్నారు. బాలీవుడ్‌ వేతన వ్యత్యాసం గురించి ఆమె తాజాగా   ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు రెమ్యూనరేషన్‌ విషయంలోనూ మార్పులు వచ్చాయని అన్నారు. 

‘‘ అప్పటితో పోలిస్తే ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. హీరోలకు, హీరోయిన్లకు ఇచ్చే రెమ్యూనరేషన్‌లో దర్శక, నిర్మాతలు గతంలో చాలా వ్యత్యాసం చూపించేవాళ్లు. హీరోలు ఒక్క సినిమాతో సంపాదించింది.. మేము 15 చిత్రాలకు తీసుకున్న మొత్తంతో సమానంగా ఉండేది. అందరి హీరోయిన్ల గురించి చెప్పడం లేదు. ఎక్కువమంది పరిస్థితి ఇలానే ఉండేది. ఆమిర్‌ఖాన్‌.. సల్మాన్‌ఖాన్‌ వంటి వారు ఎంపిక చేసుకుని చిత్రాలు చేసేవారు. నటీమణులు మాత్రం ఎక్కువ చిత్రాలను అంగీకరించేవారు. సన్నివేశాలు, పాటలు ఆకట్టుకుంటాయని అనిపించిన ప్రతీ సినిమాకు సంతకం చేసేవాళ్లు. కెరీర్‌పై ప్లానింగ్‌ ఉండేది కాదు. ఇప్పటి తారలు చాలా ప్రణాళిక వేసుకుని ముందుకు పోతున్నారు. సినిమాల ఎంపికలోనే కాదు.. పారితోషికం విషయంలోనూ వాళ్లు చాలా ముందుచూపుతో ఆలోచిస్తున్నారు ’’ అని చెప్పారు.

ప్రస్తుతం రవీనా సినిమాలు, వెబ్‌ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. ‘వెల్‌కమ్‌ 3’లో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆమె అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar)తో జోడీ కట్టనున్నారు. 20 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటిస్తుండడంతో దీనిపై ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని