Raveena Tandon: రవీనా టాండన్‌ మద్యం తాగలేదు.. దాడి ఘటనపై పోలీసుల స్పష్టత

Raveena Tandon: రవీనా టాండన్‌పై దాడి ఘటనలో ముంబయి పోలీసులు స్పష్టతనిచ్చారు. నటిపై తప్పుడు కేసు పెట్టినట్లు వెల్లడించారు.

Updated : 03 Jun 2024 11:27 IST

ముంబయి: బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ (Raveena Tandon), ఆమె డ్రైవర్‌పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ‘మాపై దాడి చేయకండి’ అంటూ నటి విజ్ఞప్తి చేస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. రవీనా, ఆమె డ్రైవర్‌ మద్యం తాగి ఉన్నారని, ర్యాష్‌ డ్రైవింగ్‌కు పాల్పడ్డారని కొందరు వారిపై ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ముంబయి పోలీసులు (Mumbai Police) స్పష్టతనిచ్చారు. అది తప్పుడు కేసు అని, నటి మద్యం తాగలేదని వెల్లడించారు. అసలేం జరిగిదంటే..

శనివారం రాత్రి ముంబయి (Mumbai)లోని బాంద్రా కార్టర్‌ రోడ్డులో వెళ్తున్న ముగ్గురిని.. అదే మార్గంలో ప్రయాణిస్తున్న రవీనా (Actress Raveena Tandon) కారు ఢీకొన్నట్లు ప్రచారం జరిగింది. బాధితుల కుటుంబ సభ్యులు, స్థానికులు కొందరు ప్రశ్నించగా రవీనా డ్రైవర్‌ వారిపై దాడికి దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అక్కడున్న వారి ఎదురు తిరగ్గా.. తమపై దాడి చేయొద్దని నటి కోరుతోందంటూ వీడియో వైరల్‌ అయ్యింది.

దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటన (Attack Incident)పై క్లారిటీ ఇచ్చారు. ‘‘నటి, ఆమె డ్రైవర్‌పై ఫిర్యాదుదారు తప్పుడు కేసు పెట్టారు. మేం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాం. కారును పార్క్‌ చేసేందుకు డ్రైవర్‌ రివర్స్‌ చేస్తుండగా అదే సమయంలో ఓ కుటుంబం ఆ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. వారు కారును ఆపి డ్రైవర్‌తో గొడవ పెట్టుకున్నారు. రివర్స్‌ చేస్తున్నప్పుడు వెనకాల ఎవరైనా ఉన్నారా లేదా అని చూసుకోవాలంటూ వాగ్వాదానికి దిగారు. ఇది కాస్తా తీవ్రంగా మారడంతో నటి అక్కడకు చేరుకొన్నారు. వారి నుంచి డ్రైవర్‌ను రక్షించుకునేందుకు ఆమె ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రవీనా, ఆమెతో గొడవపడిన వ్యక్తులు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు’’ అని పోలీసులు వెల్లడించారు. 

‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్‌ విజ్ఞప్తి.. వీడియో వైరల్‌

నటి కారు ఎవరినీ ఢీకొనలేదని, ఎవరూ గాయపడలేదని తెలిపారు. రవీనా, ఆమె డ్రైవర్‌ మద్యం తాగినట్లు వచ్చిన ఆరోపణలు కూడా అవాస్తవమేనని, వారిద్దరూ తాగలేదని స్పష్టం చేశారు. పోలీసులు విడుదల చేసిన స్టేట్‌మెంట్‌ను నటి తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పంచుకుంది.

కంగనా రనౌత్‌ మద్దతు..

ఈ ఘటనపై మరో నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘రవీనా టాండన్‌కు ఎదురైన అనుభవం చాలా తీవ్రమైనది. ఆ మూకలో ఎక్కువ మంది ఉంటే ఆమె ప్రాణాలకు ముప్పు సంభవించేది. ఇలాంటి ఘటనలను మనం ఖండించాలి. ఇలాంటి హింసాత్మక, విషపూరిత ప్రవర్తన కలిగిన వ్యక్తులను ఊరికే వదిలిపెట్టొద్దు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని కంగనా రాసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు